
ఖాన్ యూనిస్: గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్‌ను కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
వారిని భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు పాల్పడుతోంది. అక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది.