ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది.
ఈ నెల 7న ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికిపైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నపిల్లలే కావడం గమనార్హం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్–పాలస్తీనా(డీసీఐపీ) అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువ. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది బాలలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
► గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది. ఆహారం, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెబుతున్నా అవి చాలామందికి అందడం లేదు.
► తగినంత ఆహారం, నీరు లేక గాజాలో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. పారిశుధ్య వసతులు లేకపోవడంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని పేర్కొంటున్నారు.
► యుద్ధం కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు. అకారణంగా భయపడడం, రోదించడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు.
► రణక్షేత్రంలో దాడులు, ప్రతిదాడులు చూస్తూ పెరిగిన పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు.
► యుద్ధాల సమయంలో బాలలకు హక్కులుంటాయి. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉంటుంది.
► చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటూ 1949లో జెనీవాలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని 1951లో ఇజ్రాయెల్ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment