87 మంది పాలస్తీనియన్లు మృతి
40 మందికి గాయాలు
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.
ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్‌ఎఫ్
ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్‌ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్‌ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు.
రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తు
ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి.
సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్‌సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.
ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్
ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment