హైఫాపై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం
బీరూట్‌పై ఇజ్రాయెల్ ప్రతి దాడులు
10 మంది అగ్నిమాపక సిబ్బంది బలి
ఇంకా శిథిలాల కిందే చాలామంది
గాజాలో 20 మందికి పైగా మృతి
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి.
రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది.
బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్‌పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్‌లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది.
భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
మేం విఫలమైన రోజు
ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు.
Comments
Please login to add a commentAdd a comment