ఇజ్రాయెల్ దాడుల్లో 19 మంది మృతి
పాఠశాలపైనా విరుచుకుపడిన సైన్యం.. నలుగురి మృతి
ఉత్తర గాజా, దక్షిణ బీరుట్‌పై దాడులు ఉధృతం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
జబాలియా దిగ్బంధం
ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
బీరుట్‌లో ఆరుగురి మృతి
ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది.
ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment