400 మందికి గాయాలు
హమాస్ చెర నుంచి నలుగుర్ని రక్షించామన్న ఐడీఎఫ్
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్‌లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.
నలుగురు బందీలకు విముక్తి..
ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది.
తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.
ఆమె వీడియో వైరల్..
శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment