హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ మృతి | Hamas Chief Yahya Sinwar Killed In Gaza Strike? | Sakshi
Sakshi News home page

హమాస్‌కు చావుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో అధినేత యాహ్యా సిన్వార్ హతం?!

Published Thu, Oct 17 2024 7:40 PM | Last Updated on Fri, Oct 18 2024 4:42 AM

Hamas Chief Yahya Sinwar Killed In Gaza Strike?

డీఎన్‌ఏ టెస్టు తర్వాత ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌ 

హమాస్‌కు కోలుకోలేని దెబ్బ 

దియర్‌ అల్‌–బలాహ్‌ (గాజా స్ట్రిప్‌): వరుసబెట్టి అగ్రనేతలకు కోల్పోతున్న హమాస్‌కు గురువారం మరో శరాఘాతం తగిలింది. హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ తమ దాడుల్లో మృతి చెందాడని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్‌ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్‌ అని డీఎన్‌ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్‌ ప్రకటించింది. సిన్వర్‌ను అంతమొందించామని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ ప్రకటించారు.

 గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడికి సూత్రధారి సిన్వర్‌. ఈ దాడిలో 1,200 ఇజ్రాయెల్‌ దేశస్తులు చనిపోగా, 250 మందిని హమాస్‌ బందీలుగా పట్టుకుంది. అప్పటినుంచి సిన్వర్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాన లక్ష్యంగా మారారు. మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో అగ్రభాగాన ఉన్నారు. మిలటరీ వ్యూహకర్త సిన్వర్‌ మరణం హమాస్‌కు కోలుకోలేదని దెబ్బని చెప్పొచ్చు. అయితే సిన్వర్‌ మరణాన్ని హమాస్‌ ఇంకా ధ్రువీకరించలేదు. 

ఈ ఏడాది జూలైలో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియాను ఇరాన్‌ రాజధాని టెహరాన్‌లో ఇజ్రాయెల్‌ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. హనియా మరణం తర్వాత సిన్వర్‌ హమాస్‌ పగ్గాలు చేపట్టారు. ‘సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్‌ సైనిక, నైతిక విజయమని విదేశాంగ మంత్రి కట్జ్‌ అభివరి్ణంచారు. కాగా గాజాలో జబాలియాలోని స్కూలులో నిర్వహిస్తునున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 28 మంది మరణించారు.  

శరణార్థి శిబిరం నుంచి... 
యాహ్యా సిన్వర్‌ 1962లో గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో పుట్టారు. 1987లో హమాస్‌ ఏర్పడ్డప్పటి తొలినాటి సభ్యుల్లో ఒకరు. సంస్థ సాయుధ విభాగాన్ని చూసుకునేవారు. 1980ల్లోనే ఆయనను ఇజ్రాయెల్‌ అరెస్టు చేసింది. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను హత్య చేసిన నేరంలో నాలుగు జీవిత ఖైదులు విధించింది. జైల్లో పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమం లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

 2011లో ఒక్క ఇజ్రాయెలీ సైనికునికి ప్రతిగా విడుదల చేసిన వేలాది మంది పాలస్తీనా ఖైదీల్లో భాగంగా విముక్తి పొందారు. గాజాకు తిరిగొచ్చి హమాస్‌ అగ్రనేతగా ఎదిగారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాల్లేని తీరుతో ‘ఖాన్‌ యూసిస్‌ బుచర్‌’గా పేరుపొందారు. 2023 అక్టోబర్‌ 7న 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్న హమాస్‌ మెరుపుదాడి వెనక సంస్థ సాయుధ విభాగం చీఫ్‌ మొహమ్మద్‌ దెయిఫ్‌తో పాటు సిన్వర్‌ కీలకంగా వ్యవహరించారంటారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement