900 మందికిపైగా విద్యార్థుల అరెస్టు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
వర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్‌ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment