జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మృతిచెందిన వారిలో హమాస్ కమాండర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం జరిగే సూచనలు కన్పిస్తే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని అమెరికా కొద్ది రోజుల క్రితమే ఆశాభావం వ్యక్తం చేసింది.
దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయం అందాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.
ఇక, బంధీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పాలస్తీనా పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. తాజాగా ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 17 మంది మృతిచెందారు. నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 11 నెలల శిశువుతో సహా ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారని 42 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది.
గాజాపై దాడుల్లో మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. చనిపోయిన కమాండర్ ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. యూఎన్ ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న 9 మందిని గతంలోనే యూఎన్ తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment