
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.
పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు.
పాక్‌ను దెబ్బకొట్టాం..
మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.
బ్రహ్మోస్ సూపర్ పవర్..
ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి.
శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.