జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.
అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment