హమాస్ చీఫ్ హత్య
ఇరాన్ అధ్యక్షుని ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియే
కాసేపటికే టెహ్రాన్‌లోని సొంతింట్లోనే వైమానిక దాడికి బలి
పశి్చమాసియాలో సంక్షోభం తీవ్రం
ప్రతీకారం తప్పదన్న హమాస్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
కేవలం 12 గంటలు. అంత స్వల్ప వ్యవధిలో ఇటు హిజ్బొల్లాను, అటు హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది. రెండు ఉగ్ర సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి నేతలను అత్యంత కచి్చతత్వంతో కూడిన వైమానిక దాడుల ద్వారా అడ్డు తొలగించుకుంది. మంగళవారం రాత్రి హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను లెబనాన్ రాజధాని బీరూట్‌లో అంతమొందించింది. తెల్లవారుజామున తన ఆగర్భ శత్రువైన ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డులో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఆయ న సొంతింట్లోనే హత్య చేసింది.
తద్వారా ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా లక్ష్యం చేసుకోగల సత్తా తనకుందని మరోసారి నిరూపించుకుంది. గాజా యుద్ధంతో ఇప్పటికే అట్టుడుకుతున్న పశి్చమాసియాలో ఇజ్రాయెల్ తాజా చర్యలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బొల్లా కూడా షుక్ర్ మృతిని ధ్రువీకరించింది. ‘ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పద’ని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణకు ఇక దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు...
టెహ్రాన్/బీరూట్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్ గట్టిగా జవాబిచి్చంది.
కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే ప్రాణాంతక వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.
హెచ్చరించినట్టుగానే...
గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.
ఇజ్రాయెల్‌కు మరణశాసనమే: ఖమేనీ అల్టిమేటం
హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ ఆధ్యాతి్మక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.
షుక్ర్‌ను మట్టుపెట్టాం: ఇజ్రాయెల్
హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
శరణార్థి నుంచి హమాస్ చీఫ్ దాకా...
ఇస్మాయిల్ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జని్మంచారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచి్చన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్ అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు. 2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్ చీఫ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment