హీరో/విలన్.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రిమోట్ బటన్ నొక్కి.. తాను అనుకున్న వ్యక్తిని మట్టుపెడతాడు. హాలీవుడ్‌లో జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాదు.. మన దగ్గరా ‘జై చిరంజీవ’లో ఈ తరహా సీన్ ఒకటి ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోనూ సినిమాలను తలదన్నే అలాంటి ఘటనలే ఇప్పుడు మనం చూడాల్సి వస్తోంది.
ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం తెలుసు కాబట్టే.. కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలావరకు పరిమితులను పెట్టుకుంటున్నాయి చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు. అయినా కూడా దాడులు ఆగడం లేదా?. నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ గాడ్జెట్‌లు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అటు డివైజ్ కంపెనీలేమో.. ఆ పేలుళ్లకు తమకు సంబంధం లేదంటున్నాయి. ఈ ఆరోపణలు ఇలా ఉండగానే.. గతంలో ఇజ్రాయెల్ తమ చేతులకు మట్టి అంటకుండా జరిపిన కొన్ని దాడుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
నెక్ పాయిజన్
1997 హమాస్ వరుస ఆత్మాహుతి దాడులు ఇజ్రాయెల్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పుడే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బెంజమిన్ నెతన్యాహూ.. వీటికి చెక్ పెట్టాలనుకున్నారు. ఇందులో భాగంగా.. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఖలేద్ మెషాల్‌ను హత్య చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. మారు వేషంలో ఇద్దరు మోసాద్ ఏజెంట్లు.. మెషాల్ మెడ భాగం నుంచి పాయిజన్ పంపించేందుకు యత్నించారు. అయితే సకాలంలో ఆయన భద్రతా సిబ్బంది ఆ యత్నాన్ని గుర్తించారు. జోర్డాన్ పోలీసులు ఆ ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకోగా, మెషాల్‌కు విరుగుడు ఇచ్చాకే అక్కడి నుంచి తరలించారు.
ఫోన్‌కాల్‌తో..
ఇజ్రాయెల్ మరో దర్యాప్తు సంస్థ.. షిన్‌బెట్ 1996 గాజాలో హమాస్ మాస్టర్ బాంబ్ మేకర్ యాహ్యా అయ్యాష్‌ను సెల్‌ఫోన్ బాంబ్‌తో చంపింది. తన తండ్రిలో ఫోన్‌లో మాట్లాడుతున్న ఒక్కసారిగా ఫోన్ పేలిపోయి తలకు గాయమై అయ్యాష్ చనిపోయాడు. రిమోట్ ద్వారా సెల్‌ఫోన్‌లో అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాల ద్వారా మట్టు పెట్టగలిగారు.
ఫేక్ టూరిస్ట్‌లు
హమాస్‌కు ఆయుధాలు సరఫరా చేసే అంతర్జాతీయ వెపన్ డీలర్ మహమౌద్ అల్ మబౌ 2010లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. ఎమిరేట్స్ అధికారులు తొలుత అది సహజ మరణంగానే ప్రకటించి కేసు మూసేశారు. అయితే.. హమాస్ అనుమానాలు లేవనెత్తడంతో కేసును రీ ఓపెన్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. టూరిస్టుల పేరిట ఫేక్ పాస్ట్‌పోర్టులు తయారు చేయించుకుని మోస్సాద్ ఏజెంట్స్ ఆ హోటల్‌లో దిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక.. మబౌహ్ శవపరీక్షలో విషప్రయోగం జరిగినట్లు తేలింది.
ట్రాఫిక్ బ్లాస్ట్
2010-20 మధ్య ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చాలావరకు సిగ్నల్స్‌లోనే జరగడం గమనార్హం. వాహనాలు ఆగి ఉన్న టైంలో పక్కనే మరో వాహనంతో వచ్చి కాల్పులు జరపడం లేదంటే పేలుడు జరపడం లాంటివి చేశారు. ఇవి.. ఇజ్రాయెల్ దాడులేనని ఇరాన్ బహిరంగంగానే ఆరోపణలు చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అది తమ పని కాదు.. బహుశా తమ ఏజెంట్లకు ఇరాన్ మధ్య జరిగే షాడో వార్ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.
AI సాయంతో జరిగిన తొలి హత్య!
ఇరాన్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ మోహ్‌సెన్ ఫక్రిజదెహ్ మమబది హత్య. టెక్నాలజీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఏఐ లాంటి టెక్నాలజీ సాయంతో ఈ హత్య చేయించారనే కథనాలు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. 2020 నవంబర్ 27న భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఎస్కార్ట్ నడుమ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆటానమస్ శాటిలైట్ ఆపరేటెడ్ గన్ సాయంతో ఆయన్ని హత్య చేశారు. మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. పూర్తిగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం.
ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్‌సెన్. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్‌ఎన్ ఏంఏజీ మెషిన్ గన్‌ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్‌సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేశారు. అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment