ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్, హెజ్‌బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటోంది. శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.
ఇరాన్- ఇజ్రాయెల్‌ల యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాల మధ్య సాగుతోన్న భీకర దాడులు ఇద్దరు చిన్నపిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరన్ జరిపిన రాకెట్ దాడి వంటి ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలపై అమెరికా మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.
‘ఇది నిజంగా చెడు విషయం. కానీ, వారు ఆ యుద్ధ ప్రక్రియను పూర్తిచేయాలి. పాఠశాల ప్రాంగణంలోఇద్దరు చిన్నారులు కొట్లాడుకుంటున్నట్లు ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వదిలేయాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్ దళాలు 200 రాకెట్లను కూల్చేశారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ జీవించాలి. కాబట్టి ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
అయితే ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లపై విమర్శలు గుప్పించారు. వారు ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని పేర్కొన్నరు. తాను చాలాకాలంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నానని, తన అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ఈసందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదన్నారు.
కాగా హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 200 క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిలో చాలావాటిని అమెరికా మిలటరీ సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment