ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్‌బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.
అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇజ్రాయెల్
మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.
ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియా
ప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్‌బొల్లా
ఇరాన్
గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది.
సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్‌లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.
ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్
ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియా
సౌదీ అరేబియా
ఇజ్రాయెల్‌తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.
ఖతార్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్‌కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.
జోర్డాన్
ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది.
Comments
Please login to add a commentAdd a comment