హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను వైమానిక దాడితో హత్య చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఇరువురి నేతల ఫోన్ సంభాషణలో జో బైడెన్ మాట్లాడుతూ.. ఘాటుగా హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన స్థానిక ‘చానెల్ 12’వెల్లడించింది.
హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోందని, చర్చలను పునఃప్రారంభించడానికి త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతామని నెతన్యాహు అధ్యక్షుడు బైడెన్‌కు తెలియజేసే సందర్భంలో ఆయన ఘటుగా స్పందించినట్లు సమాచారం. ఇరాన్, హమాస్ విషయంలో దాడులకు తెగబడి తర్వాత తనను అందులో జోక్యం చేయవద్దని బైడెన్ నెతన్యాహును హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడిని తేలికగా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు ‘చానెల్ 12’ నివేదిక పేర్కొంది.
అయతే ఈ నివేదికలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ‘ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అమెరికాలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైన వారితో కలిసి పని చేస్తారు. అలాగే ఇజ్రాయెల్ రాజకీయాలలో అమెరికన్లు జోక్యం చేసుకోకూడదని ఆయన ఆశిస్తున్నారు’అని ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జోబైడెన్ వైదొలగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ధైర్యం చూపిస్త్ననారని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు.
మరోవైపు.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment