ఇజ్రాయెల్‌కు టెన్షన్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన! | Iran threatened Reprisals Strikes Over Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు టెన్షన్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన!

Published Fri, Apr 12 2024 8:22 AM | Last Updated on Fri, Apr 12 2024 11:20 AM

Iran threatened Reprisals Strikes Over Israel - Sakshi

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిండంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అలర్ట్‌ అయ్యారు. 

కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్‌ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్‌ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది.

అయితే, ఏప్రిల్‌ ఒకటో తేదీన సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం, ఇరాన్‌ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం కోసం ఇరాన్‌ వేచిచూస్తున్నట్టు సమాచారం. 

అయితే, ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్‌ దాడి చేయకపోవచ్చని, లెబనాన్‌ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్‌ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్‌, లెబనాన్‌, పాలస్తీనియన్‌ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది.

బైడెన్‌ కీలక ప్రకటన..
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement