హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్‌బొల్లా’ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ కూడా ఇవాళ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని అక్కడి స్థానిక మీడియా ఓ నివేదికలో వెల్లడించింది.
ఇజ్రాయెల్‌పై ఏ సమయంలోనైనా ఇరాన్ దాడికి దిగనుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జీ-7 దేశాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారని పేర్కొంది. ఇక.. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై దాడిని ఎదుర్కొవడానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై ముందస్తు దాడికి సైతం సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్ చిఫ్ డేవిడ్ బర్నియా, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్) హెర్జి హలేవిలతో ప్రధాని నెతన్యాహు ఆదివారం సమావేశమై చర్చించినట్లు తెలిపింది. మరోవైపు.. ఇరాన్ చేసే దాడిని ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని, తాము తిరిగి గట్టి సమాధానం ఇస్తామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. జెరూసలేంలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నిర్వహించిన వార్ కేబినెట్ ఆయన మాట్లాడారు. ‘ఇరాన్ దాడికి దిగితే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. ఇరాన్ దాడులకు గట్టిగా బదులు ఇస్తాం. మాపై దాడులు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు’అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment