Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.
‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు.
‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్‌బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్‌బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు.
Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024
హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు
ఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.
ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు.
గతేడాదే మొదలైంది..
కిందటి ఏడాది జులైలో హెజ్‌బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్‌బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్‌బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.
హెజ్‌బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.
దాడులు మరింత తీవ్రం
రాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్‌బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..!
Comments
Please login to add a commentAdd a comment