Palestinians killed
-
గాజాలో మరణాలు 45 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ ఆర్మి–హమాస్ సాయుధ శ్రేణుల మధ్య 14 నెలలుగా సాగుతున్న పోరులో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 45 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో అల్ జజీరా జర్నలిస్ట్ సహా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సగానికి పైగానే ఉంటారన్నారు. వీరిలో హమాస్ సాయుధులు, సాధారణ పౌరుల సంఖ్యను స్పష్టంగా చెప్పలేమని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది మిలిటెంట్లను చంపినట్లు చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ మిలటరీ ఇందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరిగిన పోరులో 45,028 మంది అసువులు బాయగా 1,06,962 మంది క్షతగాత్రులుగా మిగిలారని సోమవారం పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. సహాయక సిబ్బంది సైతం చేరుకోలేని స్థితిలో ఇప్పటికీ వందలాదిగా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని చెప్పింది. యుద్ధానికి ముందు గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లలో కనీసం 2 శాతం మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. అయితే, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. జనావాసాల మధ్యనే మిలిటెంట్ల స్థావరాలు ఉండటం వల్లే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతోంది. మృతుల్లో అల్ జజీరా టీవీ జర్నలిస్ట్ ఖాన్‌యూనిస్ నగరంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిగిన దాడిలో నలుగురు చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో ఒకరు గాజాకు చెందిన అల్ జజీరా టీవీ ప్రతినిధి అహ్మద్ బకెర్ అల్–లౌహ్(39)కాగా, ముగ్గురు పౌర రక్షణ సిబ్బందివీరిలో ఒకరు అని తెలిపాయి. అంతకుముందు జరిగిన బాంబు దాడిలో గాయపడిన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన దాడిలో బకెర్ ప్రాణాలు కోల్పోయారని అల్ జజీరా తెలిపింది. అదేవిధంగా, గాజా నగరంలోని షిజైయా ప్రాంతంలోని ఓ నివాసం భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు సహా 10 మంది మృతి చెందారు. ఖాన్ యూనిస్ నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై జరిగిన మరో దాడిలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 13 మంది చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు 105 మంది కాగా, వీరి సగం మంది గాజాలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడి చేసి వందల సంఖ్యలో పౌరులను హమాస్ శ్రేణులు అపహరించుకుపోవడంతో 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలవడం తెలిసిందే. ఈ పోరులో 55 మంది పాలస్తీనా మీడియా సిబ్బంది సహా మొత్తం 138 మంది చనిపోయినట్లు ఈ సంస్థ పేర్కొంది. అయితే, జర్నలిస్టుల ముసుగులో హమాస్ శ్రేణులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ వాదిస్తోంది. -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
Israel-Hamas war: 90 మంది దుర్మరణం
జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది. అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.ఎవరీ డెయిఫ్..?ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ వి భాగం చీఫ్‌గా వ్యవహ రిస్తున్న డెయిఫ్ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు. -
Israel-Hamas war: ఆగని దారుణ దాడులు
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం. దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. -
Israel-Hamas war: సెంట్రల్ గాజాపై భీకర దాడులు..
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం. ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్‌ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది. -
గాజాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోంది. గురువారం బీట్ లాహియా, ఖాన్ యూనిస్, అల్–మఘాజీ ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకేరోజు 50 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లాతోపాటు ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55,603 మంది గాయపడ్డారు. -
Israel-Hamas war: ‘అల్–మగజి’పై అసాధారణ దాడులు
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. -
భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్
గాజా సిటీ : ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య వైషమ్యాలు అక్కడ రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో 28 పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 16 మంది ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారిలో కేరళకు చెందిన మహిళ సౌమ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అష్కెలోన్ నగరంలో తన నివాసంలో ఉన్న సౌమ్య మంగళవారం సాయంత్రం భర్త సంతోశ్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా వదిలిన రాకెట్ ఆమె ఇంట్లో పడి పేలింది. ఒక్కసారిగా పేలడంతో ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. "వీడియో కాల్ సమయంలో నా తమ్ముడు భారీ శబ్ధం విన్నాడు. అకస్మాత్తుగా సౌమ్య ఫోన్ డిస్ కనెక్ట్ అయ్యింది. దీంతో భయాందోళనకు గురైన మేం సౌమ్య స్నేహితులకు ఫోన్ చేశాం. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది అని వారు చెప్పారు’ అని సౌమ్య బావ సాజీ స్థానిక మీడియాతో తెలిపారు. -
బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి
అమ్మాన్ : దక్షిణ జోర్డాన్‌లో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. ఈ మేరకు మీడియా సంస్త పెట్రా గురువారం వెల్లడించింది. బుధవారం అర్థరాత్రి జోర్డాన్ నగరం మాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. అధిక వేగంతో వెళ్తున్న బస్సు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మీడియా చెప్పింది. వీరంతా బస్సులో మక్కా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. మృతులంతా పాలస్తీనీయన్లని తెలిపింది.