
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు.