
గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 20 మంది దుర్మరణం
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం.
దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.