9 మంది పాలస్తీనియన్ల మృతి
జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్‌లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్‌లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు.
ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్‌లో ఒక టీనేజర్‌సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.
టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు జరగడం గమనార్హం. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. ‘‘ ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం’’ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment