పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడి
అల్ జజీరా జర్నలిస్ట్ సహా తాజాగా 52 మంది మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ ఆర్మి–హమాస్ సాయుధ శ్రేణుల మధ్య 14 నెలలుగా సాగుతున్న పోరులో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 45 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో అల్ జజీరా జర్నలిస్ట్ సహా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సగానికి పైగానే ఉంటారన్నారు. వీరిలో హమాస్ సాయుధులు, సాధారణ పౌరుల సంఖ్యను స్పష్టంగా చెప్పలేమని కూడా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 17 వేల మంది మిలిటెంట్లను చంపినట్లు చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ మిలటరీ ఇందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరిగిన పోరులో 45,028 మంది అసువులు బాయగా 1,06,962 మంది క్షతగాత్రులుగా మిగిలారని సోమవారం పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.
సహాయక సిబ్బంది సైతం చేరుకోలేని స్థితిలో ఇప్పటికీ వందలాదిగా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని చెప్పింది. యుద్ధానికి ముందు గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లలో కనీసం 2 శాతం మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. అయితే, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. జనావాసాల మధ్యనే మిలిటెంట్ల స్థావరాలు ఉండటం వల్లే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతోంది.
మృతుల్లో అల్ జజీరా టీవీ జర్నలిస్ట్
ఖాన్‌యూనిస్ నగరంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిగిన దాడిలో నలుగురు చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో ఒకరు గాజాకు చెందిన అల్ జజీరా టీవీ ప్రతినిధి అహ్మద్ బకెర్ అల్–లౌహ్(39)కాగా, ముగ్గురు పౌర రక్షణ సిబ్బందివీరిలో ఒకరు అని తెలిపాయి. అంతకుముందు జరిగిన బాంబు దాడిలో గాయపడిన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన దాడిలో బకెర్ ప్రాణాలు కోల్పోయారని అల్ జజీరా తెలిపింది.
అదేవిధంగా, గాజా నగరంలోని షిజైయా ప్రాంతంలోని ఓ నివాసం భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు సహా 10 మంది మృతి చెందారు. ఖాన్ యూనిస్ నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై జరిగిన మరో దాడిలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 13 మంది చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు 105 మంది కాగా, వీరి సగం మంది గాజాలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడి చేసి వందల సంఖ్యలో పౌరులను హమాస్ శ్రేణులు అపహరించుకుపోవడంతో 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలవడం తెలిసిందే. ఈ పోరులో 55 మంది పాలస్తీనా మీడియా సిబ్బంది సహా మొత్తం 138 మంది చనిపోయినట్లు ఈ సంస్థ పేర్కొంది. అయితే, జర్నలిస్టుల ముసుగులో హమాస్ శ్రేణులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment