హమాస్ మిలటరీ చీఫ్ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
300 మందికి గాయాలు
తీవ్రంగా ఖండించిన హమాస్
జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు.
ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది.
అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.
ఎవరీ డెయిఫ్..?
ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ వి భాగం చీఫ్‌గా వ్యవహ రిస్తున్న డెయిఫ్‌ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు.
Comments
Please login to add a commentAdd a comment