మంచులో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్న అధికారులు
లెబనాన్ : దేశంలో రావణకాష్టంలా రగులుతున్న అంతర్యుద్ధం కోరల నుంచి దూరంగా వెళ్లి బ్రతకాలనుకున్న సిరియా శరణార్ధులపై ప్రకృతి కన్నెర్రజేసింది. సిరియాను వదిలి లెబనాన్‌లో ప్రవేశించాలంటే సరిహద్దులోని పర్వతాలను దాటాల్సివుంటుంది. సరిహద్దును జాగ్రత్తగా దాటేందుకు శరణార్థుల గ్రూపు ఇద్దరు స్మగ్లర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సిరియా నుంచి బయల్దేరిన శరణార్థులు గ్రూపు లెబనాన్ సరిహద్దులోని మన్సా వద్దకు వెళ్లేసరికి పెను మంచు తుపాను ప్రారంభమైంది. దీంతో గ్రూపులోని వారందరూ చెల్లాచెదురయ్యారు. కొందరు మంచు తుపాను ధాటికి గడ్డకట్టుకుపోయి సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో పసిపిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం.
ఘటనపై సమాచారం అందుకున్న లెబనీస్ పౌర రక్షణ అధికారులు శనివారం మంచులో కూరుకుపోయిన 15 మంది శరణార్థుల మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను ప్రమాదంలో వదిలేసిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 10 లక్షల మంది సిరియన్లు లెబనాన్‌కు వలస వెళ్లారు. 2015లో దేశంలో ప్రవేశించే శరణార్థులపై లెబనాన్ ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment