హైదరాబాద్(Hyderabad) నగర వీధుల్లో చలికి గజగజ వణుకుతూ ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, నిర్భాగ్యుల((Homeless People)ను ఆదుకునేందుకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి(Aster Prime Hospital) నర్సులు(Nurses) సహృదయంతో ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వీధుల్లో ఉంటున్న సుమారు 50 మంది నిరుపేదలకు రగ్గులు పంచిపెట్టారు. సుమారు 120 మంది నర్సులు తాము సంపాదించిన దాంట్లోంచి తలా కొంత వేసుకుని ఈ రగ్గులు కొని, వీధుల్లో ఉంటున్నవారికి ఉచితంగా పంచిపెట్టారు.
ప్రతిరోజూ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఏంజెల్ నర్సులు ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని తలపెట్టి, నిరుపేదలను చలి నుంచి రక్షించేందుకు రగ్గులు పంచాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ రోడ్లపై ఉంటున్న 50 మందికి ఈ రగ్గులు అందించారు.
ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లిండామోల్ జోయ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రిస్‌మస్, కొత్త సంవత్సరం సందర్భంగా ఏదో ఒక సంబరాలు చేసుకుంటామని, ఈసారి అలా కాకుండా.. పేదలను ఆదుకోవడానికి ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.
వెంటనే తమ నర్సింగ్ గ్రూపులో పోస్ట్ చేయగా, ఏంజెల్ నర్సులు అంతా ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేశారన్నారు. వచ్చే ఏడాది కూడా మరింత మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. నర్స్ ఎడ్యుకేటర్ రాహుల్ కమర్ మాట్లాడుతూ..అన్నీ ఉన్న మనమే చలిని తట్టుకోలేకపోతున్నామని.. అలాంటిది కనీసం గూడు కూడా లేకుండా నడివీధిలో పడుకుంటున్న నిర్భాగ్యులను చూసి తామంతా చలించిపోయామని అన్నారు.
అందుకే ఈసారి వీరికి చలిని తట్టుకునేందుకు వీలుగా రగ్గులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సిబ్బంది నిరుపేదలను ఆదుకునేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తారని తెలిపారు.
(చదవండి: చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!)
Comments
Please login to add a commentAdd a comment