nurses
-
విదేశాల వైపు.. నర్సుల చూపు
రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్లను నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ కళాశాలల్లో వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో 2,821 వెరిఫికేషన్లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,662 వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. – సాక్షి, అమరావతివైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషియువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్‌వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలుభారత్ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తున్నట్టు నర్సులు చెబుతున్నారు. అదే యూఎస్ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్‌లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది. యూకేలో భారతీయులే అధికంవిదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్వైఫరీ రిజిస్టర్ బోర్డ్ ఐర్లాండ్‌లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విద్యార్హతలునర్సింగ్ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్ నర్సింగ్ కౌన్సెల్లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి. విదేశాలు వెళ్లాలంటే...ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ వంటి ల్యాంగ్వేజ్ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్ఎన్బీ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది. భారత్‌లో కొరతఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య -
నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్తంగా ఎస్ఎమ్ కేర్, హాలో లాంగ్వేజ్ సంస్థలతో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ వివరించారు. ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్ఎం కేర్ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు. -
డ్యూటీలో ఉండగానే.. నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు
-
సైగల చికిత్స
మూగ, వినికిడి సమస్య ఉన్న ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. అదీ పూర్తి ప్రసవ సమయానికి రెండు నెలల ముందుగానే. కవలల్లో పేగు సమస్యతో అబ్బాయి చనిపోయాడు. ఇక ఇప్పుడు పాప ఒక్కత్తే ఆశాజ్యోతి. కేవలం 450 గ్రాముల బరువుతో మనుగడ అవకాశాలు తక్కువ. పాపను ఎలాగైనా దక్కించుకునేందుకు ఏ విధంగానైనా ఆమెను బతికించుకునేందుకు పేరెంట్స్‌తో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి అయ్యింది.] కనీస సంభాషణల కోసం కష్టపడి పదిరోజుల్లోనే సైగల భాషనూ, సంజ్ఞాశాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విజయ సాధించారు అక్కడి కొందరు డాక్టర్లూ, నర్సులు. ఆ పాప ఇప్పుడు బతుకు బ్యారియర్స్‌ను బద్దలు కొట్టింది. నాలుగు నెలల వయసుకే అనేక అడ్డంకుల్ని అధిగమించింది. జీవన సమరంలో తొలి విజయం సాధించింది. విజయవంతంగా మనుగడ పోరాటం సాగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన దంపతులు రాజ్‌కుమార్ వయసు 55 ఏళ్లు. భాగ్యమ్మకు 47. ఇద్దరూ మూగవారు. వినికిడి, మాట సమస్యలున్నాయి. అప్పటికే ఓ చిన్నారిని కోల్పోయారు. ఎలాగైనా తమకు సంతానం కావాలని కోరిక. ఎట్టకేలకు భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. తన 47వ ఏట ప్రసవించింది. కానీ 28 వారాలకే ప్రీమెచ్యూర్‌గా పుట్టిన పిల్లలు. అంటే ఏడునెలలకే జరిగిన ప్రసవం. రెండు నెలలు ముందుగానే ప్రసవం కావడంతో కవలలు బాగా తక్కువ బరువుతో పుట్టారు. బాబు కేవలం 900 గ్రాములు. పాప బరువు మరీ తక్కువ. కేవలం 450 గ్రాములు!! మరో ఆసుపత్రిలో ప్రసవం తర్వాత... పుట్టీ పుట్టగానే ఆ బిడ్డలకు కొన్ని సమస్యాత్మకమైన రుగ్మతలు ఉండటంతో తల్లినీ, బిడ్డను కొండాపూర్‌లోని కిమ్స్–కడల్స్ నియోనేటాలజీ విభాగంలో చేర్చారు. ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ అపర్ణ నేతృత్వంలో చికిత్స మొదలుపెట్టారు. బాబుకు నెక్రొటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనే పేగుల సమస్య ఉండటంతో శస్త్రచికిత్స తప్పలేదు. కానీ బాబు దక్కలేదు. ఎన్నో వైద్య ప్రక్రియల తర్వాత, మరెన్నో నోముల తర్వాత పండిన పంట అది. ఒడి నిండినట్టే నిండిందిగానీ... ఒడిబియ్యంలో సగం జారిపోయింది. పాప తల్లిదండ్రుల వయసుపరంగా, లేదా మరేరకంగా చూసినా ఆ బంగారు తల్లిని కాపాడుకోక తప్పని పరిస్థితి. కొంగున మిగిలింది సగం బంగారమే కావడంతో ఇప్పుడా కొంగుబంగారం మరీ మరీ అపురూపం. కానీ పాప బరువు అరకిలో కంటే మరో 50 గ్రాములు తక్కువే. వైద్యసిబ్బందికి ఇదో సవాల్‌గా మారింది. తొలినాళ్లలో కుటుంబ స్నేహితుడి సాయంతో సంభాషణలు... పాప తల్లిదండ్రులిద్దరూ మూగ, వినికిడి సమస్యలున్నవారైనప్పటికీ వైద్యులకు వారితో సంభాషించడం తప్పదు. తొలి నాళ్లలో రాజ్‌కుమార్‌కు తెలిసిన ఓ అబ్బాయే ఆ దంపతులకూ, వైద్య సిబ్బందికి మధ్య సంజ్ఞావారధిగా నిలబడ్డాడు. అతడో కాలేజీ విద్యార్థి. సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్) తో సంభాషణలు జరిపేవాడు. కొన్నాళ్ల సెలవు తర్వాత రాజ్‌కుమార్ తన విధులకు హాజరవ్వక తప్పనిస్థితి. తండ్రి ఆఫీసులో, తల్లి ఆసుపత్రిలో. సంజ్ఞల వారధి తన చదువుల్లో, తన పనుల్లో మరో చోట. అయినప్పటికీ ఎలాగోలా పేపర్ల మీద రాసిచూపుతూనో, వీడియోకాల్స్ ద్వారానో సంభాషణలు కొనసాగుతున్నాయి. ఇంతలో ఇంటర్ప్రెటర్గా ఉన్న వ్యక్తికి పరీక్షలు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తొలినాళ్లలో రాజ్‌కుమార్ కొందరు వైద్యసిబ్బందికి సంకేతభాష (సైన్ లాంగ్వేజీ) నేర్పించేందుకు కొంత ప్రయత్నించారు. అప్పుడెవ్వరికీ దాని అవసరం అంతగా ఉన్నట్లు తోచలేదు. కానీ ఇప్పుడు తప్పని స్థితి! ఇక డాక్టర్లూ, వైద్యసిబ్బందీ సంభాషించక తప్పలేదు... పాపకు జరిగే వైద్య పరీక్షల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి. చిన్నారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ, చేపట్టాల్సిన విధానాల్ని తల్లికి వివరించాలి. పాలు పట్టాల్సినప్పటి ప్రక్రియలను, ఆహారమివ్వాల్సిన తీరుతెన్నులను, బిడ్డను తల్లిగుండెలకు దగ్గరగా ఉంచేందుకు అనుసరించాల్సిన ‘కంగారూ కేర్’ ప్రక్రియల్ని విపులీకరించాలి. ఇందుకు ఇరువురికీ అర్థమ్యే భాష కావాలి. కానీ ఎలా? పది రోజుల్లో అవసరమైనమేరకు శిక్షణ... తొలినాళ్లలో రాజ్‌కుమార్ తమకు కొన్ని బేసిక్స్ నేర్పడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అంతే... చిన్నారిని కాపాడుకునేందుకు అవసరమైన మేరకు సైన్ లాంగ్వేజ్‌ను ఆయననుంచే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు మెడికల్ టీమ్‌లోని కొందరు. మొత్తం పది మంది వైద్యబృందంలో కొందరు డాక్టర్లు, మరికొందరు నర్స్లూ, ఇంకొందరు సహాయక వైద్య సిబ్బంది సంజ్ఞాభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపు పదిరోజుల్లో సైగల భాషలోని అల్ఫాబెట్స్, సంఖ్యలూ, రోజులూ, వారాల పేర్లు, ఇతర వివరాలను కష్టపడి నేర్చుకున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు. తొలి విజయం ఆ మృత్యుంజయురాలిదే... గత ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి దాదాపు మూడు నెలల పాటు (సరిగ్గా చెప్పాలంటే 79 రోజులు) ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేవలం 450 గ్రాములున్న ఆ చిన్నారి క్రమంగా 1200 గ్రాములకు చేరింది. నవంబరులో డిశ్చార్జ్ నాటికి ఆ పాప బరువు 1800 గ్రాములు. మనుగడ పోరాటంలో తొలి అవరోధాలన్నింటినీ అధిగమించింది... బతుకుకు అడ్డంకి లేని బరువు సాధించింది. ప్రస్తుతం తనకు 4 నెలల వయసు. డాక్టర్ల అంచనాల ప్రకారం... అందరిలాగే మరో మూడు–నాలుగు నెలల్లో ముద్దుమాటలు (బ్యాబ్లింగ్స్) మొదలుపెట్టాలి. అందుకు వైద్యపరంగా ఎలాంటి అవరోధాలూ, అడ్డంకులూ లేవు. ప్రస్తుతానికి... ముందు ముద్దులు మూటగడుతోంది. మున్ముందు మాటలు దండగట్టాల్సి ఉంది. – యాసీన్ మేము, మా సిబ్బంది అవసరమైన మేరకు సైన్లాంగ్వేజీలో పరిజ్ఞానం సంపాదించాం... పాపను రక్షించుకునేందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోక తప్పలేదు. కొందరిలో కొత్తభాషను నేర్చుకునే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటివారు ఇతరులకు నేర్పారు. ఇలా ఆ టీమ్‌లోని పదిమంది డాక్టర్లలో ఐదారుగురు, నర్సుల్లో నలుగురైదుగురు, ఇతర సిబ్బందిలో మరికొందరు... తల్లిదండ్రులకు అవసరమైన మేరకు వివరాలను సూచించేంతగా సైన్లాంగ్వేజీలో ప్రాక్టీస్ సాగించారూ, నైపుణ్యం సాధించారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో కంటి పరీక్షలూ, న్యూరో... ఇలా అన్ని రకాల పరీక్షలూ నిర్వహించాం. మరీ ముఖ్యంగా వినికిడి పరీక్షలు. ఆ చిన్నారిలో ఎలాంటిలోపాలూ లేవు. అన్నీ నార్మల్. – డాక్టర్ అపర్ణ, క్లినికల్ డైరెక్టర్–నియోనేటాలజీ -
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్‌గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్‌తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్‌షాక్‌కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు హోదాను నర్సింగ్ ఆఫీసర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే అనేక నర్సింగ్ పోస్టుల హోదాలను మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు. హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తె చ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు. బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్ డైరెక్టరేట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు. -
డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని స్పెషలిస్ట్ డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారికి జోనల్ కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కేటాయింపు పూర్తయ్యాక కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది డాక్టర్లు ఒకేచోట పనిచేస్తున్నారు. వారిలో అనేకమందిని అవసరం ఉన్నచోటకు బదిలీ చేసేందుకుగాను డాక్టర్ల రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత నర్సులు, పారామెడికల్, క్లర్క్‌లకు కూడా జోనల్ కేటాయింపు చేసి బదిలీలు చేస్తారు. 600 మంది డాక్టర్లు... 2 వేలకుపైగా నర్సులు రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ఇప్పటికే బదిలీలు జరిగిన విషయం విదితమే. ఏడు జోన్ల పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి పెద్దఎత్తున జోనల్ కేటాయింపులు, బదిలీలు జరిగాయి. అప్పుడు జోనల్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అనేకమంది ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో వారంతా ఎక్కడికక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో జోనల్ కేటాయింపులు, అనంతరం బదిలీలు జరగనున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 600కుపైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతరులు స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు 2 వేలకుపైగా నర్సులు, 500కుపైగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ముందుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్‌లోని డాక్టర్లు, ఆ తర్వాత నర్సులు, ఇతర ఉద్యోగులకు జోనల్ కేటాయింపులు జరిపి బదిలీలు చేస్తారు. జోనల్ కేటాయింపులు కఠినంగా కాకుండా, ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే చేపడతారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా జోనల్ మార్పులు జరిగాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. చేనేతపై జీఎస్టీ రద్దుచేయాలి కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: చేనేతపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో భాగంగా ఎర్రబెల్లి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేనేతను ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీతో వారి నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. -
వీడియోకాల్‌లో డాక్టర్ సూచనలు.. గర్భిణికి ప్రసవం చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, చెన్నై: ఆస్పత్రిలో విధులకు రాకుండా వీడియో కాల్ ద్వారా నర్సుల సాయంతో ఓ గర్భిణికి డాక్టర్ ప్రసవం చేయించే ప్రయత్నం చేశాడు. శిశువు మరణించడం, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆగమేఘాలపై పెద్దాస్పత్రికి తరలించారు. మధురాంతకంలో ఈ ఘటన మంగళవారం పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాలు.. మదురాంతకం సునాంబేడు అండార్ కుప్పం గ్రామానికి చెందిన మురళి(36) ఎలక్ట్రిషియన్. ఆయన భార్య పుష్ప (33) రెండోసారి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వీరు ఇల్లిడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. పురిటి నొప్పులు రావడంతో పుష్పను సోమవారం సాయంత్రం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ వైద్యులు లేరు. ఉన్న ముగ్గురు నర్సులో ఆమెను అడ్మిట్ చేశారు. గంట తర్వాత క్రమంగా నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేయడానికి నర్సులు సిద్ధమయ్యారు. అయితే, బిడ్డ తల బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్యుడిని సంప్రదించగా వీడియో కాల్ సాయంతో ప్రసవం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రక్తస్రావం అధికం కావడంతో 108 ద్వారా పుష్ప, శిశువును మధురాంతకం ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలో శిశువు మరణించింది. పుష్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శిశువు మరణించిన సమాచారం అందించడం, వీడియో కాల్ ద్వారా నర్సులు ప్రసవం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పుష్ప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం మధురాంతకం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. చదవండి: ‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని -
నర్సులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: నర్సులకు శిక్షణ ఇచ్చే స్టేట్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఎంఐటీ)లను రాష్ట్రంలోని 10 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో దశలవారీగా ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతి, గుంటూరు నర్సింగ్ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలను నర్సుల ద్వారా అందించే ఉద్దేశంతో.. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ’ కోర్సును కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సుకు సంబంధించి పలు మార్గదర్శకాలతో వైద్య శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. 18 నెలల పాటు నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు శిక్షణ, 6 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి ఎస్‌ఎంఐటీలో ఆరుగురు మిడ్వైఫరీ ఎడ్యుకేటర్లు ఉంటారు. ఎన్‌పీఎం శిక్షణ పొందడానికి ఇన్‌సర్వీస్‌లో ఉన్న శాశ్వత, కాంట్రాక్ట్ నర్సులు అర్హులు. 45 ఏళ్లలోపు వయసు, జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత, ప్రసవాలు నిర్వహించడంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఈ కోర్సు వ్యవహారాలను డీఎంఈ పర్యవేక్షిస్తారు. శిక్షణ అనంతరం నర్సులకు సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. -
ఎనలేని సేవకు ప్రతిరూపం
దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం. గుంటూరు మెడికల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్‌పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప. ఈ రోజే ఎందుకంటే.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. నర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్ సర్వీస్ కోటాలో జీఎన్ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒకే సారి 250 స్టాఫ్‌నర్సు పోస్టులను మంజూరు చేశారు. అమ్మ కూడా నర్సే అమ్మ సముద్రాదేవి స్టాఫ్‌నర్సుగా గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్‌లో 2000లో జీఎన్ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ డిచ్‌పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది. – చిలువూరి కిరణ్మయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కావాలనుకున్నా.. డాక్టర్ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి. – పొట్లూరు మంజు, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) అమ్మ కోరిక మేరకు.. అమ్మ కోరిక మేరకు నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాను. 39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను. – షేక్ సమీనా, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) -
డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్ మెడికల్ అటెండర్ (ఆర్ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు. ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్‌కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్‌మార్టం, మెడికల్ లీగల్ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్ఘడ్ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)లో మిడ్ లెవల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ల కొరత ఉన్నందున... కోవిడ్ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్‌లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని అంశాలు ►నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్‌లో మాస్టర్ నర్సింగ్ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్‌లో డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ►భారత్‌లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ►ప్రస్తుతం ఇండియాలో మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ట్ యాక్ట్–1940ని సవరించాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్ఎంసీ–2019 యాక్ట్‌లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ జాబితాలో నర్సులను చేర్చాలి. ►నర్సింగ్ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్ నర్సింగ్‌లో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్‌లో కోర్సు పెట్టాలి. ►కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్‌లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్లో ప్రత్యేక కోర్సు ఉండాలి. -
Gandhi Hospital: కరోనా విధుల్లో కాబోయే అమ్మలు
గాంధీఆస్పత్రి: కడుపులో పెరుగుతున్న శిశువులను మోస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పేగుబంధం.. పడకపై ఉన్న ప్రాణం రెండూ తమకు ముఖ్యమేనంటున్నారు కరోనా విధులు నిర్వహిస్తున్న కాబోయే అమ్మలు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పలువురు గర్భిణులు రెండు ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ విధులు నిర్వహిస్తూ నైటింగేల్ వారసులుగా నిరూపించుకుంటున్నారు. గర్భంతో ఉండి కరోనా డ్యూటీ చేస్తున్నావా? అని ముక్కున వేలేసుకున్న ఇరుగుపొరుగువారి మాటలు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిస్తున్నా లెక్కచేయలేదు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా.. తాము ఒత్తిడికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. గాంధీఆస్పత్రిలో నర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలో పదిమంది గర్భిణులు ఉన్నారు. నాలుగు నుంచి ఎనిమిది నెలలు నిండినవారు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహించడం విశేషం. గర్భిణులైన నర్సింగ్ సిస్టర్స్ అశ్వినీ, రాణి, అనిత, అఖిల, గంగా, కవిత, సరోజ, రవళిలు అందిస్తున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మల అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏమంటున్నారంటే.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. వృత్తిధర్మాన్ని గౌరవించి భర్త నందకిషోర్, కుటుంబ సభ్యులు సహకరించారు. గాంధీ గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య విషయమై ఆందోళన ఉన్నప్పటికీ కరోనా విధుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. డ్యూటీలో చేరిన నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల్లోనే నెగెటివ్ రావడం, కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుని, తిరిగి విధుల్లో చేరాను. –అశ్వినీ సేవలు అందించేందుకే.. ఇప్పుడు నాకు ఏడో నెల. గాంధీఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావడంతో కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో డ్యూ టీ చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సేవలు అందించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నానని అందరినీ ఒప్పించాను. నెలల నిండేంత వరకు డ్యూటీకి హాజరవుతాను. శిశువు ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. భర్త సాయిబాబా, కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. – రాణి మా శ్రమను గుర్తిస్తే చాలు.. కడుపులో పెరుగుతున్న శిశువుతో పాటు రెండు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే సహచరులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. కరోనాను జయించి బాధితులు డిశ్చార్జి అవుతున్న క్షణాలు మరిచిపోలేనివి. నేను విధులు నిర్వహించే వార్డులో గర్భిణీ బాధితులు ఉన్నారు. నేను కూడా ప్రెగ్నెన్సీతో మీతోపాటే వార్డులో ఉన్నాను అంటూ ధైర్యం చెప్పడంతో వారంతా త్వరితగతిన కోలుకోవడం ఓ గొప్ప అనుభవం. పీపీఈ కిట్ వేసుకుని విధులు నిర్వహించాలంటే ఓర్పు, సహనంతోపాటు మానసికబలం ఎంతో అవసరం. – అనిత చదవండి: హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి -
ప్రజల తరఫున మీ సేవలకు సెల్యూట్
సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్తు వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్విరామంగా అందిస్తున్నసేవలకు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. ‘స్పందన’ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం వివిధ జిల్లాలకు చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తొలుత కర్నూలు జనరల్ ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుడు డాక్టర్ రవి కళాధర్, విశాఖ నుంచి స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, నెల్లూరు జీజీహెచ్ ఎంఎన్‌వో సురేష్‌బాబుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇలా.. ఓ తల్లి మాత్రమే చేయగలదు: సీఎం జగన్ నిజానికి మేం మీకు స్ఫూర్తినివ్వాల్సి ఉన్నా.. మీ మాటలు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం. ప్రాణాంతకమని తెలిసినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మీరు ఆస్పత్రుల్లో రోగులకు చేస్తున్న సేవలు.. ఒక తల్లి తన బిడ్డకు మాత్రమే చేయగలదు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మా వైపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనసులో పెట్టుకోవద్దు... ఒకవేళ మావైపు నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే మనసులో పెట్టుకోవద్దు. మీకు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధం. మీ సేవలు అమోఘం. వైద్య సిబ్బంది సేవలకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది. కిట్లు వేసుకున్నా, మాస్క్‌లు ధరించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అయినా కూడా వెనుకాడకుండా ఎంతో సేవలందిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు సెల్యూట్ చేస్తున్నా. ప్రభుత్వాస్పత్రుల్లో సమస్త సదుపాయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పుడు అన్ని సదుపాయాలున్నాయని, మందులు, ఔషధాలు మొదలు అన్ని వసతులున్నాయని డాక్టర్ రవి కళాధర్, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, ఎంఎన్‌వో సురేష్‌బాబు ముఖ్యమంత్రికి తెలిపారు. కోవిడ్ సమయంలో ఎక్కడా లోటు లేకుండా రోగులకు సేవలందిస్తున్నామని, అది తమ బాధ్యతని చెప్పారు. రోగుల ప్రాణాలు కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నాయని తెలిపారు. మీ మాటలు మాకెంతో స్థైరాన్నిచ్చాయి: డాక్టర్ రవి కళాధర్ ప్రభుత్వాస్పత్రుల్లో ఒకప్పుడు పారాసిటమల్ లాంటి చిన్న చిన్న మాత్రలు, కాటన్, సిరంజి లాంటివి కూడా బయట కొనుక్కోమని చెప్పేవాళ్లం. దీంతో పేషెంట్లు గొడవ పడేవారు. ఒక్కోసారి దాడి చేసేవారు. ఉద్యోగం అంటే విరక్తి కలిగేది. అలాంటిది ఇప్పుడు కలలో కూడా ఊహించని విధంగా కరోనా చికిత్సలకు ఖరీదైన ఇంజక్షన్లు, యాంటి బయోటిక్స్, అత్యంత ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. పేదలు, గతిలేనివారే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తారనే భావన ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కన్నా మెరుగ్గా తీర్దిదిద్దారు. వీవీఐపీలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా జీజీహెచ్‌కు వస్తున్నారు. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మీరు (సీఎం) సమస్త సదుపాయాలు కల్పించారు. ఏ మందులకూ కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిన ఘనత మీదే. మీ మాటలు మాకెంతో స్థైరాన్ని ఇచ్చాయి. తొలి నుంచి కరోనా విషయంలో వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు. ఇప్పుడు అందరూ అవే చెబుతున్నారు. -
వైరల్: కరోనా బాధితులతో డాన్స్ చేయించిన నర్సులు
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో రోజురోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా సోకి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు మనోధైర్యాన్ని నింపుతున్నారు. అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నర్సులు కోవిడ్ బాధితుల్లో హుషారు నింపారు. ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే పాటలు వేసి వారితో కలసి నృత్యాలు చేశారు. బాధితులు కూడా నర్సులతో మమేకం అయి స్టెప్పులు వేశారు. నిత్యం మంచంపైనే ఆందోళనకరంగా గడుపుతున్న తమకు నర్సులు ధైర్యం కలిగించారని బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న భార్గవి, రాణి, కృష్ణవేణి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మానసిక ఆందోళనను తగ్గించి ధైర్యంగా సంతోషంగా ఉంచేందుకు ఇలా చేశామని నర్సులు చెబుతున్నారు. అయితే కరోనా పేషెంట్లతో నర్సులు డాన్స్ చేయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సులను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. బాధితులను ఉల్లాసంగా ఉంచితే.. ప్రతి ఒక్కరు కరోనాను జయిస్తారని అంటున్నారు. చదవండి: పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం -
కామారెడ్డి ఆస్పత్రి లో కోవిడ్ పేషెంట్ల తో కలిసి నర్సుల డాన్స్
-
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
సంగీతంతో ఒత్తిడికి చెక్
కరోనా సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. ప్రజలకు చికిత్స అందించాల్సిన వైద్యులే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనాల ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో 747 మంది వైద్యులు కోవిడ్-19తో మృతి చెందారు. కళ్ల ముందే ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ, కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడంతో వైద్యులు ఒత్తిడి నుంచి దూరమవడానికి సంగీతాన్నే మార్గంగా ఎంచుకున్నారు. సంగీతంతో కరోనా రోగుల్లోనే కాకుండా, వైద్యుల్లో కూడా ఒత్తిడి మాయమవుతుందని డాక్టర్ అనినా పటేల్ చెబుతున్నారు. వైద్యుల డ్యాన్స్ వీడియోలు ట్రోల్ అవుతున్నా కరోనా ఒత్తిడిని జయించడానికి సంగీతమే మార్గమని వారంటున్నారు. చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు -
'కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు'
ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది. ► నైటింగేల్ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు. అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్ఎమ్గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు. ► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్ లో వేశాడు. అక్కడే టెంత్ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్ ట్రెయినింగ్ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్‌నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది. అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని యుహెచ్పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్ తర్వాత ఎఎన్‌ఎమ్‌గా శిక్షణ తీసుకున్నాను. ► కోవిడ్–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు.. శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన. అరుణ: కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్ ఎక్కించి, హోమ్ క్వారంటైన్లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్ చెక్ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్ తర్వాత కూడా అందరం ఆన్‌డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం. ► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు.. శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్హెచ్ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ. అరుణ: ఇప్పటివరకు బెస్ట్ ఏఎన్ఎమ్గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్ డ్యూటీ చేసినందుకు కేటీఆర్ సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్ ఇస్తూనే ఉంది. ► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు. అరుణ: ట్రెయినింగ్ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నిలదొక్కుకున్నాను. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో నర్సింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా. – నిర్మలారెడ్డి -
రెండేళ్లలో 10,000 మంది నర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది. ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్ కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్లు ఉన్నాయి. ► మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు. ► ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది. ► ప్రతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది. ► ఎంపికైన నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు. ► శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు. ► కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు. హెల్త్ క్లినిక్‌లలో 12 రకాల సేవలు ► గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు ► నవజాత శిశువులు టీకాలు ► చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు ► కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు ► సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు ► సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం ► కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు ► సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు ► వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు ► అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం ► చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్ ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్మెంట్ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం. – అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
కరోనాపై యుద్ధంలో సమిధలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది. ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్‌వైఫ్‌గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో లాక్డౌన్ లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్‌లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. -
నర్సులే బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య ఉప కేంద్రాలకు నర్సులనే బాస్‌లుగా నియమించాలని సర్కా ర్ నిర్ణయించింది. పల్లెవాసులకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై దృష్టిపెట్టింది. గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులి వ్వడం వంటివి నిర్వహిస్తున్నారు. వీటిలో ఇక నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదాను ఏర్పాటు చేస్తారు. దానికి నర్సులే బాస్‌లుగా ఉంటారు. టీకాలు, మందులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా షుగర్ టెస్టులు, బీపీ చెక్ చేయడం తదితర ఆరోగ్య సేవలు అందిస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. సబ్ సెంటర్లనే హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్ చేస్తారు. ఔట్‌సోర్సింగ్‌లకూ అవకాశం ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన నర్సులను ఉప కేంద్రాల్లో నియమిస్తారు. ఉప కేంద్రాల్లో పనిచేసే నర్సు లకు 6 నెలలు బ్రిడ్జి కోర్సులో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యా క నెలకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తారు. పనితీరు ఆధారం గా నెలకు రూ.15 వేల వరకు పారితోషికం ఇస్తారు. ఎంపికైన వారిలో శాశ్వ త ఉద్యోగులుంటే ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా వారికి వేతనం ఉంటుంది. పారితోషికాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇస్తా రు. ఎంపికైన ఎంఎల్‌హెచ్‌పీలు మూడేళ్ల పాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేయాలి. ఆ మేరకు హామీపత్రం ఇవ్వాలి. వీరు ఉప కేంద్రం ఉన్నచోటే నివాసం ఉండాలి. -
ప్రజలందరికీ రక్షకులు నర్సులు
న్యూఢిల్లీ: ఎదుటివారని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతోన్న రక్షకులు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులను అభివర్ణించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో నర్సింగ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి కోవింద్ రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్‌నాథ్ కోవింద్ వారిని సత్కరించారు. సహజంగా రక్షాబంధన్ రోజు, తమ సోదరుల నుంచి అక్కాచెల్లెళ్ళు రక్షణను కోరకుంటారు. అయితే నర్సులు మాత్రం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో సోదరులకు, ప్రజలందరికీ రక్షణగా నిలుస్తారు అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులపై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ మహమ్మారితో పోరాడుతోన్న వారికి సేవలందిస్తూ కరోనా బారిన పడినప్పటికీ తిరిగి కోలుకుని, నూతన శక్తితో విధులను నిర్వర్తించిన సైనిక విభాగంలోని నర్సులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. నర్సులందరికీ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. -
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుంటే.. మరోవైపు పలు ప్రైవేట్ ఆస్పత్రులు దారుణానికి పాల్పడుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ డ్యూటీకి రావాలంటూ నర్సులను వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మోహదీపట్నంలోని నానాల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం తమిళనాడుకు చెందిన నర్సులను నిర్భంధించింది. జ్వరం వచ్చినప్పటికీ ట్యాబ్లెట్ వేసుకుని డ్యూటీకి రావాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో దిక్కుతోచని నర్సులు ఈ విషయాన్ని తెలంగాణ నర్సింగ్ సమితికి దృష్టికి తీసుకు వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.