ప్రాణమిచ్చే బతుకు దీపాలు | Pranamicce practice lights | Sakshi
Sakshi News home page

ప్రాణమిచ్చే బతుకు దీపాలు

Published Tue, May 20 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ప్రాణమిచ్చే బతుకు దీపాలు

ప్రాణమిచ్చే బతుకు దీపాలు

దేవుడు ప్రాణం పోస్తాడు... డాక్టర్లు ప్రాణం నిలుపుతారు
 మరి... నర్సులు?... ప్రాణాల మీద ఆశ కల్పిస్తారు
 బతకగలమనే భరోసా కల్పిస్తారు... ఇక ఈ జీవితం ఇంతే అనుకున్న రోగికి...
 నీకు ఇంకా జీవితం ఉంది... ఆ జీవితాన్ని ఆనందంగా జీవించాలి...
 అంటూ జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోస్తారు.
 అడుగడుగునా సేవలందిస్తూ స్వస్థత చేకూరుస్తారు.
 కొడిగడుతున్న ప్రాణాలకు రెండు చేతులనూ అడ్డుగా పెట్టి ఆసరాగా నిలుస్తారు.
 ఇలాంటి సేవలకు గుర్తింపుగా... జ్ఞానలక్ష్మి, సౌమ్య, డైజీ థామస్ అనే నర్సులు...
 రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు అందుకున్నారు... వారి అనుభవాలు, అభిప్రాయాల సుమహారం!

 
నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో జీవదాన్ ఆసుపత్రి. రకరకాల పేషెంట్లలో గుండెపోటు వచ్చిన పేషెంట్లు ఇద్దరు ఉన్నారు. డ్యూటీ డాక్టర్‌లు రౌండ్స్ పూర్తి చేసుకుని నర్సులకు చెప్పి వెళ్లిపోయారు. వాళ్లలా వెళ్లిన కొంతసేపటికే ఒక పేషెంటుకి గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న సౌమ్య సిస్టర్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. పేషెంటు ప్రాణాపాయంలో ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రాణానికి ఆపద వాటిల్లింది. ప్రాణాన్ని కాపాడి వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిమిషం ఆమెకి తెలిసింది అదొక్కటే... అంతే! కరెంట్ స్ట్రోక్స్ ఇచ్చేశారు. పేషెంటు తెరిపిన పడ్డాడు. డాక్టరు ఇవ్వాల్సిన ఆ ట్రీట్‌మెంట్‌ను తానే నిర్వహించే చొరవ ఆ క్షణంలో తీసుకోక తప్పలేదు.
 
ఇంతలో మరో పేషెంటుకు కూడా అదే పరిస్థితి... అతడి గుండెమీద కొట్టి, కొట్టి... ఆగిపోబోతున్న గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ రోజు ఏమిటిలా అనుకుంటూండగా సాయంత్రానికి మరో ఉపద్రవం. ప్రసూతి విభాగంలో ఒక బిడ్డ పుట్టగానే ఏడవలేదు, అపస్మారక స్థితిలో ఉంది. అందరిలో కంగారు... ఇంతలో సౌమ్య సిస్టర్ వెంటనే నోటితో బిడ్డకు గాలి అందించి కాపాడారు.
 
ఇరవై మూడేళ్ల వృత్తి జీవితంలో సౌమ్య సిస్టర్‌కి ఇలాంటి అనుభవాలెన్నో. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ... ‘‘మా వృత్తిలో ఇవి చాలా మామూలే, కానీ ఈ మూడూ ఒకేరోజు జరగడం మాత్రం చాలా విచిత్రం. ఆ రోజు నాకు నా వృత్తిధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాననే తృప్తి కలిగింది. ప్రాణాన్ని ఇవ్వగలిగింది దేవుడొక్కడే. ఆ ప్రాణానికి ఆపద వాటిల్లినప్పుడు కాపాడే ప్రయత్నమే మాది. ఆ ప్రయత్నాన్ని అంకితభావంతో చేయాలి. ఇన్నేళ్లుగా అదే చేస్తూ వచ్చాను’’ అన్నారు సిస్టర్ సౌమ్య.
 సిస్టర్ సౌమ్యది కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామం.

1980లో విజయవాడలోని ఫ్రాన్సిస్‌కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ కాన్వెంట్‌లో చేరారు. అక్కడ పదేళ్లపాటు శిక్షణ పొందిన తర్వాత జీవదాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో నర్సుగా చేరారు. ‘‘పేషెంట్లు తమ ప్రాణాలను మా చేతుల్లో పెడతారు. సాంత్వన పరుస్తూ మాట్లాడి, ప్రాణాలను కాపాడి ఆరోగ్యంగా ఇంటికి సాగనంపాలి. మా దృష్టి వ్యక్తి ప్రాణం కాపాడడం మీదనే ఉండాలి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగక పేషెంటు ప్రాణం పోవచ్చు. కానీ మా మనసులో పేషెంటుని కాపాడాలనే తపన చావకూడదు’’ అంటారామె.
 
ఆమెతోపాటుగా అదే రోజు రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్న మరో సిస్టర్ జ్ఞానలక్ష్మి. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో యశోదా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. ‘‘మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్న జార్జ్ సింగరేణి కాలరీస్‌లో ఆడిటర్. మా కాలేజ్ ప్రిన్సిపల్ కైలాసపతిగారు మా నాన్నగారికి సలహా ఇవ్వడంతో నేను ఇంటర్ తర్వాత బి.ఎస్.సి నర్సింగ్‌కి హైదరాబాద్‌కు వచ్చాను. కోర్సు పూర్తయిన తర్వాత 1970వ సంవత్సరం ఫిబ్రవరిలో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్సుగా చేరాను.

ఈ రంగంలోకి వచ్చి నలభై ఐదేళ్లు కావస్తోంది. ఇన్నేళ్లలో క్లినికల్ ఏరియా, ఆపరేషన్ థియేటర్, టీచింగ్... ఈ మూడు రంగాల్లోనూ పనిచేశాను. నర్సింగ్ రంగంలో ఎన్ని విభాగాలలో ఉద్యోగం చేసినప్పటికీ ఆత్మసంతృప్తి మాత్రం పేషెంటుకు నేరుగా సేవచేయగలిగిన క్లినికల్ ఏరియాలోనే’’నంటారామె. ‘‘వరంగల్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయి మా హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు అన్నీ బెడ్ మీదనే. అలాంటి అమ్మాయిని నెల రోజుల్లో నడిపించాను. డాక్టర్లు మందులు ఇస్తారు, డాక్టరు బాధ్యత పూర్తయిన చోట మా బాధ్యత మొదలవుతుంది.

ఆ అమ్మాయి మంచానికి అతుక్కుపోతే ఇక జీవితం ఏమిటి అని మనసు కలచి వేసేది. దాంతో నా ఉద్యోగ విధులకే పరిమితం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆమెకి ఫిజియోథెరపీ చేయించడం, రోజూ పరామర్శించి ‘నీకు తగ్గిపోతుంది, నడుస్తావు, నువ్వు పెళ్లి చేసుకుని బిడ్డనెత్తుకోవడాన్ని కూడా మేము చూస్తాం’ అని చెప్తుండేదాన్ని. డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి, వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని మర్చిపోలేను. ఒక జీవితాన్ని నిలపగలిగాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు’’ అంటారు జ్ఞానలక్ష్మి.
 
వీరిద్దరూ ఇలా అంటుంటే ఇదే అవార్డును వీరితోపాటు అందుకున్న డైజీ థామస్ మాత్రం... ‘దేవుడి సేవలో మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అంటారు. ‘‘ఈ వృత్తిలో ఉండాల్సింది సేవచేయాలనే అకుంఠిత దీక్ష మాత్రమే. అది మనసులో కలగాలి. మనస్ఫూర్తిగా సేవ చేయాలనే తపన ఉండాలి. అంతకు మించిన స్ఫూర్తి మరోటి ఉండదు’’ అంటారు. ఈమె సికింద్రాబాద్‌లోని రైల్వే ఆసుపత్రిలో చీఫ్ మాట్రన్. ఈ వృత్తిలోని వారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. వారి సేవలకు ఈ అవార్డులు కరదీపికలు కాలేవు. కానీ గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక మాత్రం కాగలుగుతాయి.
 - వాకా మంజులారెడ్డి,
 ఇన్‌పుట్స్: ప్రభాకర్, న్యూస్‌లైన్, ఎల్లారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement