రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరతకు చెక్
జీరో వేకెన్సీ పాలసీ అమలు.. ఐదేళ్లలో 54 వేల పోస్టుల భర్తీ
ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ఫలితంగా గ్రామీణ పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత 0.86% మాత్రమే
అదే జాతీయ స్థాయిలో 22.30 శాతం మేర వైద్యుల లేమి
దేశం మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం నర్సుల కొరత
ఏపీలో కేవలం 4.7 శాతం మేర మాత్రమే నర్సు పోస్టుల ఖాళీ
ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు చెక్ పెట్టడం కోసం 2019–24 మధ్య ఏకంగా 54 వేల వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది.
ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్‌ల(ఎంవో)కు గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని 22.30 శాతం మేర ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా, కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్ర మే ఉన్నట్టు స్పష్టమైంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.
ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేసింది. మరోవైపు పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో సైతం 5.22 శాతం ఎంవోల కొరత ఉంది. కర్ణాటకలో 14.21 శాతం, తమిళనాడులో 11.58, తెలంగాణలో 36.27 శాతం మేర వైద్యుల కొరత ఉంది.
ఉత్తరాదిలోని యూపీలో ఏకంగా 36.44 శాతం, బిహార్‌లో 34.62, గుజరాత్‌లో 17.69 శాతం వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో దేశం మొత్తం 46,692 నర్సు పోస్టులకు గాను 10,814 పోస్టులు(23.16 శాతం) ఖాళీగా ఉన్నాయి. యూపీలో 64.94 శాతం, బిహార్‌లో 35.59 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఏపీలో 4.74 శాతం పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
నాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ
⇒ 2019–24 మధ్య వైద్యశాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగ విరమణలు, వీఆర్‌ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేక రిక్రూట్‌మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు.
⇒ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలను ఇచ్చి మరీ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు 61 శాతం దేశవ్యాప్తంగా కొరత ఉండగా, రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉండేది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులను సైతం అందుబాటులో ఉంచింది.
⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడించింది. దీంతో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ అవ్వక ప్రజలకు వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment