మూగ, వినికిడి సమస్య ఉన్న ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. అదీ పూర్తి ప్రసవ సమయానికి రెండు నెలల ముందుగానే. కవలల్లో పేగు సమస్యతో అబ్బాయి చనిపోయాడు. ఇక ఇప్పుడు పాప ఒక్కత్తే ఆశాజ్యోతి. కేవలం 450 గ్రాముల బరువుతో మనుగడ అవకాశాలు తక్కువ. పాపను ఎలాగైనా దక్కించుకునేందుకు ఏ విధంగానైనా ఆమెను బతికించుకునేందుకు పేరెంట్స్‌తో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి అయ్యింది.]
కనీస సంభాషణల కోసం కష్టపడి పదిరోజుల్లోనే సైగల భాషనూ, సంజ్ఞాశాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విజయ సాధించారు అక్కడి కొందరు డాక్టర్లూ, నర్సులు. ఆ పాప ఇప్పుడు బతుకు బ్యారియర్స్‌ను బద్దలు కొట్టింది. నాలుగు నెలల వయసుకే అనేక అడ్డంకుల్ని అధిగమించింది. జీవన సమరంలో తొలి విజయం సాధించింది. విజయవంతంగా మనుగడ పోరాటం సాగిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన దంపతులు రాజ్‌కుమార్ వయసు 55 ఏళ్లు. భాగ్యమ్మకు 47. ఇద్దరూ మూగవారు. వినికిడి, మాట సమస్యలున్నాయి. అప్పటికే ఓ చిన్నారిని కోల్పోయారు. ఎలాగైనా తమకు సంతానం కావాలని కోరిక. ఎట్టకేలకు భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. తన 47వ ఏట ప్రసవించింది. కానీ 28 వారాలకే ప్రీమెచ్యూర్‌గా పుట్టిన పిల్లలు. అంటే ఏడునెలలకే జరిగిన ప్రసవం. రెండు నెలలు ముందుగానే ప్రసవం కావడంతో కవలలు బాగా తక్కువ బరువుతో పుట్టారు. బాబు కేవలం 900 గ్రాములు. పాప బరువు మరీ తక్కువ. కేవలం 450 గ్రాములు!!
మరో ఆసుపత్రిలో ప్రసవం తర్వాత... పుట్టీ పుట్టగానే ఆ బిడ్డలకు కొన్ని సమస్యాత్మకమైన రుగ్మతలు ఉండటంతో తల్లినీ, బిడ్డను కొండాపూర్‌లోని కిమ్స్–కడల్స్ నియోనేటాలజీ విభాగంలో చేర్చారు. ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ అపర్ణ నేతృత్వంలో చికిత్స మొదలుపెట్టారు. బాబుకు నెక్రొటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనే పేగుల సమస్య ఉండటంతో శస్త్రచికిత్స తప్పలేదు. కానీ బాబు దక్కలేదు.
ఎన్నో వైద్య ప్రక్రియల తర్వాత, మరెన్నో నోముల తర్వాత పండిన పంట అది. ఒడి నిండినట్టే నిండిందిగానీ... ఒడిబియ్యంలో సగం జారిపోయింది. పాప తల్లిదండ్రుల వయసుపరంగా, లేదా మరేరకంగా చూసినా ఆ బంగారు తల్లిని కాపాడుకోక తప్పని పరిస్థితి. కొంగున మిగిలింది సగం బంగారమే కావడంతో ఇప్పుడా కొంగుబంగారం మరీ మరీ అపురూపం. కానీ పాప బరువు అరకిలో కంటే మరో 50 గ్రాములు తక్కువే. వైద్యసిబ్బందికి ఇదో సవాల్‌గా మారింది.
తొలినాళ్లలో కుటుంబ స్నేహితుడి సాయంతో సంభాషణలు...
పాప తల్లిదండ్రులిద్దరూ మూగ, వినికిడి సమస్యలున్నవారైనప్పటికీ వైద్యులకు వారితో సంభాషించడం తప్పదు. తొలి నాళ్లలో రాజ్‌కుమార్‌కు తెలిసిన ఓ అబ్బాయే ఆ దంపతులకూ, వైద్య సిబ్బందికి మధ్య సంజ్ఞావారధిగా నిలబడ్డాడు. అతడో కాలేజీ విద్యార్థి. సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్) తో సంభాషణలు జరిపేవాడు. కొన్నాళ్ల సెలవు తర్వాత రాజ్‌కుమార్ తన విధులకు హాజరవ్వక తప్పనిస్థితి. తండ్రి ఆఫీసులో, తల్లి ఆసుపత్రిలో. సంజ్ఞల వారధి తన చదువుల్లో, తన పనుల్లో మరో చోట. అయినప్పటికీ ఎలాగోలా పేపర్ల మీద రాసిచూపుతూనో, వీడియోకాల్స్ ద్వారానో సంభాషణలు కొనసాగుతున్నాయి.
ఇంతలో ఇంటర్‌ప్రెటర్‌గా ఉన్న వ్యక్తికి పరీక్షలు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తొలినాళ్లలో రాజ్‌కుమార్ కొందరు వైద్యసిబ్బందికి సంకేతభాష (సైన్ లాంగ్వేజీ) నేర్పించేందుకు కొంత ప్రయత్నించారు. అప్పుడెవ్వరికీ దాని అవసరం అంతగా ఉన్నట్లు తోచలేదు. కానీ ఇప్పుడు తప్పని స్థితి!
ఇక డాక్టర్లూ, వైద్యసిబ్బందీ సంభాషించక తప్పలేదు...
పాపకు జరిగే వైద్య పరీక్షల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి. చిన్నారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ, చేపట్టాల్సిన విధానాల్ని తల్లికి వివరించాలి. పాలు పట్టాల్సినప్పటి ప్రక్రియలను, ఆహారమివ్వాల్సిన తీరుతెన్నులను, బిడ్డను తల్లిగుండెలకు దగ్గరగా ఉంచేందుకు అనుసరించాల్సిన ‘కంగారూ కేర్’ ప్రక్రియల్ని విపులీకరించాలి. ఇందుకు ఇరువురికీ అర్థమ్యే భాష కావాలి. కానీ ఎలా?
పది రోజుల్లో అవసరమైనమేరకు శిక్షణ...
తొలినాళ్లలో రాజ్‌కుమార్ తమకు కొన్ని బేసిక్స్ నేర్పడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అంతే... చిన్నారిని కాపాడుకునేందుకు అవసరమైన మేరకు సైన్ లాంగ్వేజ్‌ను ఆయననుంచే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు మెడికల్ టీమ్‌లోని కొందరు. మొత్తం పది మంది వైద్యబృందంలో కొందరు డాక్టర్లు, మరికొందరు నర్స్‌లూ, ఇంకొందరు సహాయక వైద్య సిబ్బంది సంజ్ఞాభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపు పదిరోజుల్లో సైగల భాషలోని అల్ఫాబెట్స్, సంఖ్యలూ, రోజులూ, వారాల పేర్లు, ఇతర వివరాలను కష్టపడి నేర్చుకున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు.
తొలి విజయం ఆ మృత్యుంజయురాలిదే...
గత ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి దాదాపు మూడు నెలల పాటు (సరిగ్గా చెప్పాలంటే 79 రోజులు) ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేవలం 450 గ్రాములున్న ఆ చిన్నారి క్రమంగా 1200 గ్రాములకు చేరింది. నవంబరులో డిశ్చార్జ్ నాటికి ఆ పాప బరువు 1800 గ్రాములు. మనుగడ పోరాటంలో తొలి అవరోధాలన్నింటినీ అధిగమించింది... బతుకుకు అడ్డంకి లేని బరువు సాధించింది. ప్రస్తుతం తనకు 4 నెలల వయసు. డాక్టర్ల అంచనాల ప్రకారం... అందరిలాగే మరో మూడు–నాలుగు నెలల్లో ముద్దుమాటలు (బ్యాబ్లింగ్స్) మొదలుపెట్టాలి. అందుకు వైద్యపరంగా ఎలాంటి అవరోధాలూ, అడ్డంకులూ లేవు. ప్రస్తుతానికి... ముందు ముద్దులు మూటగడుతోంది. మున్ముందు మాటలు దండగట్టాల్సి ఉంది. – యాసీన్
మేము, మా సిబ్బంది అవసరమైన మేరకు సైన్‌లాంగ్వేజీలో పరిజ్ఞానం సంపాదించాం...
పాపను రక్షించుకునేందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోక తప్పలేదు. కొందరిలో కొత్తభాషను నేర్చుకునే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటివారు ఇతరులకు నేర్పారు. ఇలా ఆ టీమ్‌లోని పదిమంది డాక్టర్లలో ఐదారుగురు, నర్సుల్లో నలుగురైదుగురు, ఇతర సిబ్బందిలో మరికొందరు... తల్లిదండ్రులకు అవసరమైన మేరకు వివరాలను సూచించేంతగా సైన్‌లాంగ్వేజీలో ప్రాక్టీస్ సాగించారూ, నైపుణ్యం సాధించారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో కంటి పరీక్షలూ, న్యూరో... ఇలా అన్ని రకాల పరీక్షలూ నిర్వహించాం. మరీ ముఖ్యంగా వినికిడి పరీక్షలు. ఆ చిన్నారిలో ఎలాంటిలోపాలూ లేవు. అన్నీ నార్మల్. – డాక్టర్ అపర్ణ, క్లినికల్ డైరెక్టర్–నియోనేటాలజీ
Comments
Please login to add a commentAdd a comment