Florence Nightingale
-
Florence Nightingale: మానవత్వానికి ప్రతిరూపం నర్స్
కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రాణాలు కాపాడటానికి నిద్రలేని రాత్రులు గడిపి కంటికి కనపడని వైరస్‌తో నిత్యం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఫ్రంట్ వారియర్స్ ఎవరైనా ఉన్నారంటే నర్సులు మాత్రమే. వారు చేస్తున్న సేవలు అమోఘం. ఇటలీలో 1812 సంవత్సరంలో ఫానీ నైటింగేల్, విలియం ఎడ్వర్డ్ దంపతులకు , ధనిక కుటుం బంలో మే 12న ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మించింది. ఆ రోజుల్లో ఇటలీలో ఆస్పత్రులు అధ్వాన్న స్ధితిలో ఉండేవి. శుచి, శుభ్రత, ఏమాత్రం ఉండేవికావు. నర్సు కావాలని కలలు కన్న నైటింగేల్ 1852లో ఐర్లాండ్ వెళ్ళింది. ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు, రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854 నుండి 1856 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మాతృదేవత ఆమె. ఫ్లారెన్స్ నైటింగేల్ పుట్టిన రోజైన మే 12న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ఒక పండుగలా జరుపుకుంటారు. గత 15 నెలలుగా కుటుంబాలకు దూరం అయి, కరోనా బారిన పడి మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేస్తూ ఫ్రంట్ వారియర్‌గా ఊపిరి పోస్తున్న మాతృ దేవతకు ప్రతిరూపం అయిన నర్సులకు చేతులెత్తి ప్రపంచమంత మొక్కక తప్పదు. మానవుల నుంచి మానవులకి సంక్రమించే ఈ వైరస్ వ్యాప్తిని లెక్క చేయకుండా, వృత్తి ధర్మానికి కట్టుబడి, సేవా దృక్పథంతో, యుద్ధంలో సైనికునిలా.. కంటికి కనపడని కరోనా వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. అందుకే శిరసు వంచి ప్రపంచం ప్రణమిల్లుతోంది. నైటింగేల్ వారసులు, నర్సులు చేస్తున్న సేవలు అనిర్వచనీయం. (నేడు ‘ఫ్లారెన్స్ నైటింగేల్’201 జయంతి,) డా. సంగని మల్లేశ్వర్, జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం మొబైల్ 98662 55355 -
మానవతామూర్తులు – నర్సులు
ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి. ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆమె జన్మించి నేటికి 200 సంవత్సరాలు. ప్రతి ఏడాది ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స సంరక్షణను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలకు వెలకట్టలేం. కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ వారిని అపార్ట్మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్లతో హాస్పిటల్స్ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారికీ సహకరించి, మద్దతుగా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలనే‘ నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాదృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులను గౌరవిద్దాం. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం. (నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, నైటింగేల్ 200 జయంతి) పుల్లూరు వేణుగోపాల్, మొబైల్ 97010 47002 -
కరోనా: ‘క్వారెంటైన్’ ఎలా వచ్చింది?
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిక కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నేడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ‘క్వారెంటైన్’ పాటిస్తున్నాయి. ఈ పదం ఎప్పుడు ? ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది? ఆసలు దీని అర్థం ఏమిటీ ? ఇటాలియన్ పదం ‘క్వారెంటీనా జియోర్ని’ నుంచి వచ్చింది. దానర్థం ‘40 రోజులు’ అని. అంటే 40 రోజులపాటు ప్రజలను నిర్బంధంగా ఇంటికే పరిమితం చేస్తే అంటు రోగాల బారిన పడకుండా రక్షించవచ్చని ఆ నాటి ప్రజల అభిప్రాయమా?. (కరోనా: పురుషుల సంఖ్యే అధికం.. కారణమిదే!) ప్రపంచ దేశాలను ముఖ్యంగా, యూరప్, ఆసియా దేశాలను మొదటిసారి ‘ప్లేగ్’ కుదిపేసినా 14వ శతాబ్దంలోనే ఈ ‘క్వారెంటైన్’ అనే పదం అమల్లోకి వచ్చింది. అప్పట్లో 40 రోజుల్లో ఏ అంటురోగమైనా తగ్గుతుందన్న విషయం ప్రజలెవరికీ తెలియదు. ఆ మాటకొస్తే బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రోబ్స్ ఉంటాయని, వాటి ద్వారా అంటు రోగాలు వస్తాయన్న అవగాహన లేదు. మైక్రోబ్స్‌ను 16వ శతాబ్దంలో కనుగొన్నారు. కాకపోతే ఎలుకల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు అంటురోగాలు వస్తాయని తెలుసు. అందుకని ఇళ్లు కదలకుండా 40 రోజుపాటు స్వీయ నిర్బంధంలో ఉంటే రోగం బారిన పడకుండా తప్పించుకోవచ్చన్న అభిప్రాయం వారికి ఎలా వచ్చింది?. అయితే 40 రోజులనే పదం ఎలా పుట్టింది? జుడాయియన్ ఎడారిలో దెయ్యానికి వ్యతిరేకంగా జీసస్ 40 రోజుల పాటు యుద్ధం చేశారు కనుక దెయ్యం లాంటి అంటురోగాలు మటుమాయం కావాలంటే 40 రోజులు అవసరమని భావించి ఉండవచ్చు! లేదా గ్రీకు తత్వవేత్త పైథాగరస్‌కు నాలుగు అంకే ఇష్టం కనుక నాలుగు నుంచి 40 రోజుల పదం తీసుకొని ఉండవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం చరిత్ర పుటల్లో లేవు. అప్పుడు చలికాలం 40 రోజులపాటు ఉండేది. అప్పుడే సముద్ర తీరాల్లో అంటురోగాలు విస్తరిస్తాయి కనుక 40 రోజులనే పదం అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చనే మరో వాదన ఉంది. ఈ వాదన వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అప్పట్లో శాస్త్ర విజ్ఞానం పట్ల అంత అవగాహన లేదు. ఏదిఏమైన సముద్ర తీరాల్లోనే అంటురోగాలతో మనుషులు జబ్బు పడటాన్ని గుర్తించిన ప్రజలు ఇతర తీరాల నుంచి పడవల ద్వారా జబ్బులను తీసుకొస్తున్నారని భావించి ముందుగా నావికులపై ‘క్వారెంటైన్’ను విధించారు. అంటే వారు సముద్ర తీరాన్ని వదిలి గ్రామాల్లోకి వెళ్ల కూడదని. వారిపై నిఘాను ఉంచాల్సిన బాధ్యత నౌకల కెప్టెన్లది. అయినప్పటికీ వారి కెప్టెన్ల కళ్లుకప్పి నావికులు గ్రామల్లోకి వెళ్లి వచ్చేవారు. ఆ విషయాన్ని కెప్టెన్లు సంబంధిత అధికారులకు తెలియకుండా దాచేవారు. ఆ తర్వాత క్వారెంటైన్ విధానం అంటురోగుల బారిన పడ్డవారికి, పడకుండా ప్రజలను రక్షించడానికి అమల్లోకి వచ్చింది. అంటే రోగులందరిని ఒక్క చోట చేర్చి వారికి వైద్య సదుపాయం అందించడం. ఆ క్వారెంటైన్‌ను తెలుగులో నిర్బంధ వైద్య శిబిరం అనవచ్చు. ప్రజలను ఇళ్లు కదలకుండా చేయడం లేదా విశాలమైన ప్రాంగణంలో బయటకు రాకుండా ఉంచడం రెండోరకమైన క్వారెంటైన్. దీన్ని తెలుగులో ప్రజా నిర్బంధం లేదా స్వీయ నిర్బంధం అని పిలవచ్చు. ‘సెల్ప్ ఐసోలేషన్’ అనే ఆంగ్ల పదం నుంచి స్వీయ ఏకాంతం లేదా స్వీయ నిర్బంధం వచ్చింది. మొదటిసారి ప్లేగ్ 14వ శతాబ్దంలోరాగా, మూడవసారి ప్లేగ్ 19వ శతాబ్దంలో వచ్చింది. ఇటలీ 1830లో క్వారెంటైన్‌ను అమలు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. ‘బ్రిటీష్ పాలకులు 1825లో క్వారెంటైన్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1875లో పబ్లిక్ హెల్త్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు చట్టాల కింద బ్రిటన్ ప్రభుత్వం క్వారెంటైన్‌ను అమలు చేసేది. అప్పట్లో యూరప్‌లో క్వారెంటైన్ చక్కగా అమలు జరిగేది. భారత్‌లో దానికి వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగేవి. కుల, మత, లింగ వివక్షతలే అందుకు కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజలను స్వచ్ఛందంగా క్వారెంటైన్లో ఉండుమని చెప్పాలిగానీ, వారిపై నిర్బంధంగా ఒత్తిడి తీసుకురావద్దని, అది ప్రజలను మానసికంగా దెబ్బతీస్తుందని ‘ది టైమ్స్ లీడర్’ 1892, నవంబర్ రెండవ తేదీ సంచికలో అధికారులను హెచ్చరించింది. అదే ఏడాది వెనిస్లో జరిగిన ఐరోపా దేశాల సదస్సు బ్రిటిష్ ప్రభుత్వం పాటిస్తున్న క్వారెంటైన్ విధానం బాగుందని, అన్ని దేశాలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తీర్మానించింది. నర్సింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆచరించిన ‘ఏకాంత వాసమే’ బ్రిటిష్ క్వారెంటైన్ విధానం. ఓసారి విదేశీ ప్రయాణం నుంచి వచ్చి జబ్బు పడిన నైటింగేల్ తోటి నర్సులనే కాకుండా, సొంత తండ్రిని కూడా దరిచేరనీయకుండా గదిలో ఒంటరిగా గడిపారు. (కరోనా కల్లోలం.. 11 మంది భారతీయుల మృతి) -
కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్
న్యూఢిల్లీ : ‘ప్రతి నర్సు తరచుగా తన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతోపాటు ముఖం కూడా కడుక్కోవడం ఇంకా మంచిది’ అని ఫ్లోరెన్స్ నైటింగేల్ 1860లో చెప్పిన మాటలు కరోనా వైరస్ కలవర పెడుతున్న నేటి సమయంలో గుర్తుకు వస్తున్నాయి. ఆమె నర్సుల గురించి చెప్పినప్పటికీ ఆమె ఉద్దేశం ఒక్కటే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటు రోగాలు రావని, తద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని. ఆమె 1860లో రాసిన ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ పుస్తకంలో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవాలి’ అనే విషయం ఉంది. (కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి) ఆ పుస్తకంలో నర్సుల విధులేమిటీ? వాటిని ఎలా నిర్వర్తించాలో? చెప్పడం కంటే వ్యాధులకు ప్రజలు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఎక్కువగా ఉంది. ఇల్లు, పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా ఇంటికి కిటికీలు ఉండాలంటూ పలు సూచనలు చేశారు. ఆమె ఎక్కువగా తన సేవలను యుద్ధాల్లో గాయపడిన సైనికులకే కేటాయించారు. అప్పట్లో గాయపడిన సైనికులు ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువ మంది చనిపోయేవారు. ఆమె ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతోపాటు, సైనికుల గాయాలను శుభ్రంగా తుడిచి చికిత్స అందించేవారు. ఆస్పత్రుల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేసేవారు. ఆమె ఓసారి భారత్‌లోని ఓ సైనికుల ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారట. ‘క్రిమియన్ వార్’ సమయంలో బ్రిటీష్ సైనిక ఆస్పత్రిలో నర్సింగ్ మేనేజర్‌గా ఆమె పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వైద్యపరమైన వైఫల్యాలపై ఆమె ఏకంగా 900 పేజీల నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆ సమయంలో ఆమెకు ‘ది లేడి విత్ ది ల్యాంప్’ అనే నిక్ నేమ్ వచ్చింది. రాత్రివేళల్లో ఆమె దీపం పట్టుకొని గాయపడిన సైనికుల వద్దకు వెళ్లి పరామర్శించేవారు. ఆ యుద్ధానంతరం ఆమె ఫ్లూ లాంటి ‘బ్రూసెల్లాయిస్’ జబ్బు బారిన పడ్డారు. అప్పుడు ఆమె తనవద్దకు ఎవరూ రావద్దంటూ కుటుంబ సభ్యులను, తోటి నర్సులతో సామాజిక దూరం పాటించారు. ఒంటరిగా నిర్బంధంలో ఉన్నారు. ఆమె 1860లోనే సెయింట్ థామస్ హాస్పటల్లో నర్సుల కోసం ‘నైటింగేల్ ట్రెయినింగ్ స్కూల్’ను 1861లో కింగ్స్ కాలేజ్ ఆస్పత్రిలో ‘మిడ్వైఫరీ ట్రేనింగ్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ నైటింగేల్ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నర్సింగ్ సేవలకు అంకితమిచ్చి నాటి నుంచి నేటి వరకు నర్సింగ్కు మార్గదర్శకురాలిగా మిగిలిపోయారు. (లాక్డౌన్లో ఆకలి చావులను ఆపాలంటే...) -
సేవా దీప్తి.. సహనమే స్ఫూర్తి
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ.. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్న.. అన్న మాటను నిజం చేస్తూ నిరంతరం అంకిత భావంతో రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. బాధితులను మేమున్నామంటూ ఓదారుస్తూ సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయ పలకరింపు, స్ఫూర్తిదాయక సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తమకు ఆదర్శమంటూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. యుద్ధంలో, ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి.. సేవలందించి బాధితులలో మానసిక ధైర్యాన్ని నింపిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు నర్సుల అభిప్రాయూలు వారి మాటల్లోనే.. -జంగారెడ్డిగూడెం రూరల్ నైటింగేల్ మాకు ఆదర్శం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది మంది నర్సులు సేవలందిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మా అందరికీ ఆదర్శం. ప్రస్తుతం పలువురు నర్సులకు ఉద్యోగ భద్రత కరువైంది. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - డి.దయామణి, జిల్లా కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల అసోసియేషన్ కార్యదర్శి సంతృప్తిగా ఉంది నర్సు వృత్తిలో చేరినప్పటి నుంచి విధిగా కాకుండా సేవగా భావించి పనిచేస్తున్నాను. రోగులను ఆప్యాయంగా పలకిస్తూ వారితో అనురాగాన్ని పంచుకుంటున్నా. వారికి ఆత్మీయతను పంచుతున్నా. ఈ వృత్తి నాకెంతో సంతృప్తిగా ఉంది. రోగులకు సేవ చేస్తూ దైవానికి సేవ చేసినట్టుగా భావిస్తున్నా. - బోడా రాజరాజేశ్వరి, నర్సు, జంగారెడ్డిగూడెం సేవే లక్ష్యంగా.. రోగి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సపర్యలు చేస్తుంటారు నర్సులు. జిల్లాలో ఒకే ఒక్క మేల్ నర్సుగా సేవలందిస్తూ అవార్డు కూడా అందుకున్నాను. మాకు నైటింగేల్ ఆదర్శం. రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అనే తారతమ్యం లేకుండా సేవే పరమావధిగా పనిచేస్తున్నాం. - దాగం వేణుగోపాలచారి, కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
ప్రాణమిచ్చే బతుకు దీపాలు
దేవుడు ప్రాణం పోస్తాడు... డాక్టర్లు ప్రాణం నిలుపుతారు మరి... నర్సులు?... ప్రాణాల మీద ఆశ కల్పిస్తారు బతకగలమనే భరోసా కల్పిస్తారు... ఇక ఈ జీవితం ఇంతే అనుకున్న రోగికి... నీకు ఇంకా జీవితం ఉంది... ఆ జీవితాన్ని ఆనందంగా జీవించాలి... అంటూ జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోస్తారు. అడుగడుగునా సేవలందిస్తూ స్వస్థత చేకూరుస్తారు. కొడిగడుతున్న ప్రాణాలకు రెండు చేతులనూ అడ్డుగా పెట్టి ఆసరాగా నిలుస్తారు. ఇలాంటి సేవలకు గుర్తింపుగా... జ్ఞానలక్ష్మి, సౌమ్య, డైజీ థామస్ అనే నర్సులు... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు అందుకున్నారు... వారి అనుభవాలు, అభిప్రాయాల సుమహారం! నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో జీవదాన్ ఆసుపత్రి. రకరకాల పేషెంట్లలో గుండెపోటు వచ్చిన పేషెంట్లు ఇద్దరు ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు రౌండ్స్ పూర్తి చేసుకుని నర్సులకు చెప్పి వెళ్లిపోయారు. వాళ్లలా వెళ్లిన కొంతసేపటికే ఒక పేషెంటుకి గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న సౌమ్య సిస్టర్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. పేషెంటు ప్రాణాపాయంలో ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రాణానికి ఆపద వాటిల్లింది. ప్రాణాన్ని కాపాడి వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిమిషం ఆమెకి తెలిసింది అదొక్కటే... అంతే! కరెంట్ స్ట్రోక్స్ ఇచ్చేశారు. పేషెంటు తెరిపిన పడ్డాడు. డాక్టరు ఇవ్వాల్సిన ఆ ట్రీట్మెంట్ను తానే నిర్వహించే చొరవ ఆ క్షణంలో తీసుకోక తప్పలేదు. ఇంతలో మరో పేషెంటుకు కూడా అదే పరిస్థితి... అతడి గుండెమీద కొట్టి, కొట్టి... ఆగిపోబోతున్న గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ రోజు ఏమిటిలా అనుకుంటూండగా సాయంత్రానికి మరో ఉపద్రవం. ప్రసూతి విభాగంలో ఒక బిడ్డ పుట్టగానే ఏడవలేదు, అపస్మారక స్థితిలో ఉంది. అందరిలో కంగారు... ఇంతలో సౌమ్య సిస్టర్ వెంటనే నోటితో బిడ్డకు గాలి అందించి కాపాడారు. ఇరవై మూడేళ్ల వృత్తి జీవితంలో సౌమ్య సిస్టర్‌కి ఇలాంటి అనుభవాలెన్నో. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ... ‘‘మా వృత్తిలో ఇవి చాలా మామూలే, కానీ ఈ మూడూ ఒకేరోజు జరగడం మాత్రం చాలా విచిత్రం. ఆ రోజు నాకు నా వృత్తిధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాననే తృప్తి కలిగింది. ప్రాణాన్ని ఇవ్వగలిగింది దేవుడొక్కడే. ఆ ప్రాణానికి ఆపద వాటిల్లినప్పుడు కాపాడే ప్రయత్నమే మాది. ఆ ప్రయత్నాన్ని అంకితభావంతో చేయాలి. ఇన్నేళ్లుగా అదే చేస్తూ వచ్చాను’’ అన్నారు సిస్టర్ సౌమ్య. సిస్టర్ సౌమ్యది కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామం. 1980లో విజయవాడలోని ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ కాన్వెంట్లో చేరారు. అక్కడ పదేళ్లపాటు శిక్షణ పొందిన తర్వాత జీవదాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో నర్సుగా చేరారు. ‘‘పేషెంట్లు తమ ప్రాణాలను మా చేతుల్లో పెడతారు. సాంత్వన పరుస్తూ మాట్లాడి, ప్రాణాలను కాపాడి ఆరోగ్యంగా ఇంటికి సాగనంపాలి. మా దృష్టి వ్యక్తి ప్రాణం కాపాడడం మీదనే ఉండాలి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగక పేషెంటు ప్రాణం పోవచ్చు. కానీ మా మనసులో పేషెంటుని కాపాడాలనే తపన చావకూడదు’’ అంటారామె. ఆమెతోపాటుగా అదే రోజు రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్న మరో సిస్టర్ జ్ఞానలక్ష్మి. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో యశోదా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. ‘‘మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్న జార్జ్ సింగరేణి కాలరీస్‌లో ఆడిటర్. మా కాలేజ్ ప్రిన్సిపల్ కైలాసపతిగారు మా నాన్నగారికి సలహా ఇవ్వడంతో నేను ఇంటర్ తర్వాత బి.ఎస్.సి నర్సింగ్‌కి హైదరాబాద్‌కు వచ్చాను. కోర్సు పూర్తయిన తర్వాత 1970వ సంవత్సరం ఫిబ్రవరిలో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా చేరాను. ఈ రంగంలోకి వచ్చి నలభై ఐదేళ్లు కావస్తోంది. ఇన్నేళ్లలో క్లినికల్ ఏరియా, ఆపరేషన్ థియేటర్, టీచింగ్... ఈ మూడు రంగాల్లోనూ పనిచేశాను. నర్సింగ్ రంగంలో ఎన్ని విభాగాలలో ఉద్యోగం చేసినప్పటికీ ఆత్మసంతృప్తి మాత్రం పేషెంటుకు నేరుగా సేవచేయగలిగిన క్లినికల్ ఏరియాలోనే’’నంటారామె. ‘‘వరంగల్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయి మా హాస్పిటల్లో చేరింది. ఆమెకు అన్నీ బెడ్ మీదనే. అలాంటి అమ్మాయిని నెల రోజుల్లో నడిపించాను. డాక్టర్లు మందులు ఇస్తారు, డాక్టరు బాధ్యత పూర్తయిన చోట మా బాధ్యత మొదలవుతుంది. ఆ అమ్మాయి మంచానికి అతుక్కుపోతే ఇక జీవితం ఏమిటి అని మనసు కలచి వేసేది. దాంతో నా ఉద్యోగ విధులకే పరిమితం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆమెకి ఫిజియోథెరపీ చేయించడం, రోజూ పరామర్శించి ‘నీకు తగ్గిపోతుంది, నడుస్తావు, నువ్వు పెళ్లి చేసుకుని బిడ్డనెత్తుకోవడాన్ని కూడా మేము చూస్తాం’ అని చెప్తుండేదాన్ని. డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి, వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని మర్చిపోలేను. ఒక జీవితాన్ని నిలపగలిగాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు’’ అంటారు జ్ఞానలక్ష్మి. వీరిద్దరూ ఇలా అంటుంటే ఇదే అవార్డును వీరితోపాటు అందుకున్న డైజీ థామస్ మాత్రం... ‘దేవుడి సేవలో మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అంటారు. ‘‘ఈ వృత్తిలో ఉండాల్సింది సేవచేయాలనే అకుంఠిత దీక్ష మాత్రమే. అది మనసులో కలగాలి. మనస్ఫూర్తిగా సేవ చేయాలనే తపన ఉండాలి. అంతకు మించిన స్ఫూర్తి మరోటి ఉండదు’’ అంటారు. ఈమె సికింద్రాబాద్‌లోని రైల్వే ఆసుపత్రిలో చీఫ్ మాట్రన్. ఈ వృత్తిలోని వారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. వారి సేవలకు ఈ అవార్డులు కరదీపికలు కాలేవు. కానీ గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక మాత్రం కాగలుగుతాయి. - వాకా మంజులారెడ్డి, ఇన్పుట్స్: ప్రభాకర్, న్యూస్‌లైన్, ఎల్లారెడ్డి -
బీహార్ మహిళకు ‘నైటింగేల్’ పురస్కారం
పాట్నా: పోలియో నివారణకు విశేష సేవలందించినందుకుగానూ బీహార్‌కు చెందిన ఆరోగ్య శాఖ అధికారి మార్తా డోడ్రేను భారత ప్రభుత్వం ఆదివారం ఫ్లోరెన్స్ నైటింగేల్ 2014 అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్ల మార్తా బీహార్‌కు పొరుగునే ఉన్న జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన గిరిజన మహిళ. ఆమె బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని కుషేశ్వర్‌స్థాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. పోలియో టీకాల ప్రచారంలో తన పనితీరును గుర్తించి అవార్డు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందని మార్తా చెప్పారు. పోలియో టీకాల ప్రచారంలో భాగంగా ఆమె ప్రతిరోజూ మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు అనేక కిలోమీటర్లు కాలినడకనే వెళ్లి వందలాది మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించారు. ఈ అవార్డు కింద మార్తాకు రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా మే 12న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా డోడ్రేకు అవార్డు ప్రదానం చేయనున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు డోడ్రే ఎంపికైన సంగతి తెలిసిందే.