నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం
మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ.. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్న.. అన్న మాటను నిజం చేస్తూ నిరంతరం అంకిత భావంతో రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. బాధితులను మేమున్నామంటూ ఓదారుస్తూ సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయ పలకరింపు, స్ఫూర్తిదాయక సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తమకు ఆదర్శమంటూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. యుద్ధంలో, ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి.. సేవలందించి బాధితులలో మానసిక ధైర్యాన్ని నింపిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు నర్సుల అభిప్రాయూలు వారి మాటల్లోనే..
-జంగారెడ్డిగూడెం రూరల్
నైటింగేల్ మాకు ఆదర్శం
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది మంది నర్సులు సేవలందిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మా అందరికీ ఆదర్శం. ప్రస్తుతం పలువురు నర్సులకు ఉద్యోగ భద్రత కరువైంది. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- డి.దయామణి, జిల్లా కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల అసోసియేషన్ కార్యదర్శి
సంతృప్తిగా ఉంది
నర్సు వృత్తిలో చేరినప్పటి నుంచి విధిగా కాకుండా సేవగా భావించి పనిచేస్తున్నాను. రోగులను ఆప్యాయంగా పలకిస్తూ వారితో అనురాగాన్ని పంచుకుంటున్నా. వారికి ఆత్మీయతను పంచుతున్నా. ఈ వృత్తి నాకెంతో సంతృప్తిగా ఉంది. రోగులకు సేవ చేస్తూ దైవానికి సేవ చేసినట్టుగా భావిస్తున్నా.
- బోడా రాజరాజేశ్వరి, నర్సు, జంగారెడ్డిగూడెం
సేవే లక్ష్యంగా..
రోగి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సపర్యలు చేస్తుంటారు నర్సులు. జిల్లాలో ఒకే ఒక్క మేల్ నర్సుగా సేవలందిస్తూ అవార్డు కూడా అందుకున్నాను. మాకు నైటింగేల్ ఆదర్శం. రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అనే తారతమ్యం లేకుండా సేవే పరమావధిగా పనిచేస్తున్నాం.
- దాగం వేణుగోపాలచారి,
కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల
యూనియన్ జిల్లా అధ్యక్షుడు
సేవా దీప్తి.. సహనమే స్ఫూర్తి
Published Tue, May 12 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement