ఫ్లోరెన్స్ నైటింగేల్
ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి. ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆమె జన్మించి నేటికి 200 సంవత్సరాలు. ప్రతి ఏడాది ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు.
ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స సంరక్షణను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలకు వెలకట్టలేం. కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ వారిని అపార్ట్‌మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్లతో హాస్పిటల్స్ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
వారి సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారికీ సహకరించి, మద్దతుగా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలనే‘ నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాదృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులను గౌరవిద్దాం. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం.
(నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, నైటింగేల్ 200 జయంతి)
పుల్లూరు వేణుగోపాల్, మొబైల్ 97010 47002
Comments
Please login to add a commentAdd a comment