
అబ్బే అసభ్యత లేదు.. కేవలం జోకులే!!
ముంబై: పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'లో నర్సును చూపించిన తీరుపై దుమారం రేగుతుండటంతో దీనిపై ఈ షో వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్ శర్మ స్పందించాడు. తమ షోను ఆందోళనకారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. షోలో భాగంగా నర్సు గురించి జోకులు వేసినంతమాత్రాన.. అది నర్సులందరికీ వర్తిస్తుందని భావించడం సరికాదన్నాడు. నర్సులను అసభ్యంగా షో చూపిస్తున్నారన్న వివాదం నేపథ్యంలో నర్సు పాత్రను షో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా కొనసాగిస్తామని బదులిచ్చాడు. ఆ క్యారెక్టర్‌తో షోలో తాము కామెడీ మాత్రమే చేస్తున్నామని, అందులో అసభ్యత లేదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చాడు.
'ద కపిల్ శర్మ షో'లో 'హాట్' నర్సుగా రోచెల్లా రావును, స్థూలకాయమున్న నర్సుగా కికు శార్దాను చూపిస్తూ వెకిలీ హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమృత్‌సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఇటీవల రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా నర్సులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు.