
టీవీషోలో నర్సులను అవమానించిన యాంకర్!!
దేశంలోనే నంబర్ వన్ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ. ఆయన యాంకర్ కమ్ స్టాండప్ కమెడీయన్‌గా వచ్చే పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'.
దేశంలోనే నంబర్ వన్ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ. ఆయన యాంకర్ కమ్ స్టాండప్ కమెడీయన్‌గా వచ్చే పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. హిందీ టీవీ రేటింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఈ షోలో తాజాగా నర్సును చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సులను దారుణంగా అవమానించేలా ఈ షోలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత్‌సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన నర్సులు మంగళవారం కపిల్ శర్మ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు.
నర్సులంటే అంత చులకనా?
నర్సులకు వ్యక్తిత్వం ఉండదని, వారిని సులువుగా లోబర్చుకోవచ్చుననే తప్పుడు పద్ధతిలో కపిల్ తన షోలో మమల్ని చూపించారని, అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదుచేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. గతంలోనూ నర్సులను కించపరిచేలా కపిల్ శర్మ చూపించారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పంజాబ్ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 'ద కపిల్ శర్మ షో'లో నర్సు పాత్రలో కనిపిస్తున్న రొచెల్లె రావు వేసుకున్న నర్సు యూనిఫామ్‌ను కూడా అసభ్యంగా చూపిస్తున్నారని, ఈ షోలో తమను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.