కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత | Lifting of Leprosy Control Units | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత

Published Mon, May 22 2023 2:22 AM | Last Updated on Mon, May 22 2023 2:22 AM

Lifting of Leprosy Control Units - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్‌ తదితర సేవలు ఉన్నాయి.

అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్‌–డివిజనల్‌ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్‌సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.  

40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్‌వోలు 
ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్‌సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది.

కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్‌ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్‌వోలను కొత్తగా నియమిస్తారు. 

80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం 
గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది.

దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. 

అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది 
ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది.

ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement