
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే 300 మందికి పైగా నర్సులు తమ ఉద్యోగాలను వీడి మణిపూర్, త్రిపుర, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. నర్సులు అనూహ్యంగా విధులకు దూరమవడంతో ఆయా ఆస్పత్రుల్లో రోగుల సేవలకు ఆటంకం ఎదురైంది. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు తూర్పు భారత ఆస్పత్రుల సంఘం (ఏహెచ్‌ఈఐ) లేఖ రాసింది. కాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత వారం 185 మంది నర్సులు మణిపూర్‌కు వెళ్లారు. ఇక శనివారం 169 మంది నర్సులు స్వస్థలాలకు వెళ్లారు. వీరిలో 92 మంది మణిపూర్‌కు చెందిన వారు కాగా, 32 మంది ఒడిషా..43 మంది త్రిపుకు చెందిన వారని కోల్‌కతా నగరానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాలు తెలిపాయి.
కాగా, నర్సులు ఎందుకు హఠాత్తుగా విధులకు రాజీనామా చేయడానికి విస్పష్ట కారణం తెలియరాకున్నా మణిపూర్‌కు తిరిగివచ్చిన వారికి ఆకర్షణీయ స్టైఫండ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేసిందని తెలిసిందని ఏహెచ్‌ఈఐ చీఫ్ ప్రదీప్ లాల్ మెహతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ ప్రచారం అవాస్తమని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని చెప్పారు. ఏ ఒక్కరినీ తిరిగి రావాలని తాము కోరలేదని..కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో వారు సేవలందించడం పట్ల తాము సగర్వంగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు, నర్సులు వారు పనిచేసే ఆస్పత్రుల్లో అసౌకర్యంగా భావిస్తే అది వారు పనిచేసే సంస్థల నిర్వాహకులే అందుకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వారు అక్కడే పనిచేయాలని తాము వారిని ఒత్తిడి చేయలేమని చెప్పుకొచ్చారు. భద్రతకు సంబంధించిన ఆందోళన, తల్లితండ్రుల ఒత్తిడితోనే తాను ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని మణిపూర్ తిరిగి వచ్చిన ఓ నర్సు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment