ప్రజల తరఫున మీ సేవలకు సెల్యూట్‌ | CM Jagan comments with doctors and medical staff | Sakshi
Sakshi News home page

ప్రజల తరఫున మీ సేవలకు సెల్యూట్‌

Published Thu, May 27 2021 3:01 AM | Last Updated on Thu, May 27 2021 3:01 AM

CM Jagan comments with doctors and medical staff - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ విపత్తు వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్విరామంగా అందిస్తున్నసేవలకు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. ‘స్పందన’ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం వివిధ జిల్లాలకు చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తొలుత కర్నూలు జనరల్‌ ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుడు డాక్టర్‌ రవి కళాధర్, విశాఖ నుంచి స్టాఫ్‌ నర్స్‌ విజయలక్ష్మి, నెల్లూరు జీజీహెచ్‌ ఎంఎన్‌వో సురేష్‌బాబుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఇలా.. ఓ తల్లి మాత్రమే చేయగలదు: సీఎం జగన్‌ 
నిజానికి మేం మీకు స్ఫూర్తినివ్వాల్సి ఉన్నా.. మీ మాటలు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ కోవిడ్‌ సంక్షోభ సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం. ప్రాణాంతకమని తెలిసినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మీరు ఆస్పత్రుల్లో రోగులకు చేస్తున్న సేవలు.. ఒక తల్లి తన బిడ్డకు మాత్రమే చేయగలదు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మా వైపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

మనసులో పెట్టుకోవద్దు...
ఒకవేళ మావైపు నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే మనసులో పెట్టుకోవద్దు. మీకు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధం. మీ సేవలు అమోఘం. వైద్య సిబ్బంది సేవలకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది. కిట్లు వేసుకున్నా, మాస్క్‌లు ధరించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అయినా కూడా వెనుకాడకుండా ఎంతో సేవలందిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు సెల్యూట్‌ చేస్తున్నా.

ప్రభుత్వాస్పత్రుల్లో సమస్త సదుపాయాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పుడు అన్ని సదుపాయాలున్నాయని, మందులు, ఔషధాలు మొదలు అన్ని వసతులున్నాయని డాక్టర్‌ రవి కళాధర్, స్టాఫ్‌ నర్స్‌ విజయలక్ష్మి, ఎంఎన్‌వో సురేష్‌బాబు ముఖ్యమంత్రికి తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఎక్కడా లోటు లేకుండా రోగులకు సేవలందిస్తున్నామని, అది తమ బాధ్యతని చెప్పారు. రోగుల ప్రాణాలు కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నాయని తెలిపారు.

మీ మాటలు మాకెంతో స్థైరాన్నిచ్చాయి: డాక్టర్‌ రవి కళాధర్‌
ప్రభుత్వాస్పత్రుల్లో ఒకప్పుడు పారాసిటమల్‌ లాంటి చిన్న చిన్న మాత్రలు, కాటన్, సిరంజి లాంటివి కూడా బయట కొనుక్కోమని చెప్పేవాళ్లం. దీంతో పేషెంట్లు గొడవ పడేవారు. ఒక్కోసారి దాడి చేసేవారు. ఉద్యోగం అంటే విరక్తి కలిగేది. అలాంటిది ఇప్పుడు కలలో కూడా ఊహించని విధంగా కరోనా చికిత్సలకు ఖరీదైన ఇంజక్షన్లు, యాంటి బయోటిక్స్, అత్యంత ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. పేదలు, గతిలేనివారే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తారనే భావన ఉండేది. ఇప్పుడు కార్పొరేట్‌ కన్నా మెరుగ్గా తీర్దిదిద్దారు. వీవీఐపీలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా జీజీహెచ్‌కు వస్తున్నారు. కోవిడ్‌ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మీరు (సీఎం) సమస్త సదుపాయాలు కల్పించారు. ఏ మందులకూ కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిన  ఘనత మీదే. మీ మాటలు మాకెంతో స్థైరాన్ని ఇచ్చాయి. తొలి నుంచి కరోనా విషయంలో వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు. ఇప్పుడు అందరూ అవే చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement