సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్ బాక్సులు, మాస్క్‌ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధ సంస్థ ‘టీవర్క్స్’అందించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)తో పాటు బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థ కూడా ఎయిరోసోల్ బాక్సుల తయారీలో పాలుపంచుకుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి నోరు, శ్వాసనాళం ద్వారా ఎండో ట్రాకియల్ ట్యూబ్‌ను అమర్చేందుకు పారదర్శకంగా ఉండే ఈ ఎయిరోసోల్ బాక్సులు ఉపయోగపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో భాగంగా ట్యూబ్‌ను అమర్చే క్రమంలో వైద్యులు, సహాయ సిబ్బందికి ఈ బాక్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎయిరోసోల్ బాక్సుల అవసరాన్ని గుర్తించిన నిమ్స్ విద్యార్థుల కోసం ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ సైన్స్ కిట్లు’(డీఐయూ కిట్స్) తయారు చేసే బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థకు బాధ్యత అప్పగించింది.
ఈ కిట్ల నమూనాపై ఆన్‌లైన్‌లో శోధించిన సదరు సంస్థకు తైవాన్‌కు చెందిన ఓ వైద్యుడు తయారు చేసిన ఎయిరోసోల్ బాక్స్ నమూనా దొరికింది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేయడంలో సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ‘టీ వర్క్స్’రంగంలోకి దిగి అవసరమైన సాంకేతికతను సమకూర్చింది. స్థానికంగా లభించే ముడివనరులు, సాంకేతికతతో ఎయిరోసోల్ కిట్లను తయారు చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ సంస్థ మరిన్ని నమూనాలు రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. వాడిన కిట్లను పడేయడం (డిస్పోజల్), ఒకసారి ఉపయోగించిన బాక్సులను మళ్లీ వాడటం (రీ యూజబుల్) డిజైన్లు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో ఎయిరోసోల్ బాక్సు ధర రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిమ్స్‌కు పది కిట్లు సరఫరా చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అవసరానికి అనుగుణంగా బాక్సుల సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా టీ వర్క్స్ పనితీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ ‘అవసరాలే ఆవిష్కరణలకు మాతృక’అని
వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment