మహబూబ్‌నగర్ ఐటీ హబ్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తలపెట్టిన ఐటీ హబ్‌ల నిర్మాణ పురోగతిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ట్విట్టర్ వేదికగా వివరించారు. డిజిటైజ్, డికార్బనైజ్, డి సెంట్రలైజ్ నినాదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఐటీ హబ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో ఐటీ హబ్‌లు త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఫొటోలు షేర్ చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో సిద్దిపేట ఐటీ హబ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, కొద్దినెలల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండ ఐటీ హబ్ పనులు శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఐదారు నెలల్లో ప్రారంభిస్తామన్నారు.
రెండో ఐటీ కేంద్రంగా వరంగల్
వరంగల్ ఐటీ హబ్‌లో పేరొందిన కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండో అతిపెద్ద ఐటీ కేంద్రంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ఎన్‌ఐటీ (వరంగల్), ఆర్‌జీయూకేటీ (బాసర) వంటి పేరొందిన విద్యా సంస్థల్లో గ్రామీణ విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారిని ఐటీ రంగం అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు టి– హబ్, టి –వర్క్స్, వి– హబ్ వంటి సంస్థల ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment