యువతలో పెరుగుతున్న ఆసక్తి
ఏపీ నుంచి గత ఏడాది నర్సింగ్ కౌన్సిల్‌లో 2,821 ఫారిన్ వెరిఫికేషన్‌లు
ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,662 పూర్తి
రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది.
విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్‌లను నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ కళాశాలల్లో వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో 2,821 వెరిఫికేషన్‌లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,662 వెరిఫికేషన్‌లు పూర్తయ్యాయి. – సాక్షి, అమరావతి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేష కృషి
యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్‌వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.
పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలు
భారత్ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తున్నట్టు నర్సులు చెబుతున్నారు.
అదే యూఎస్‌ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్‌లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది.
యూకేలో భారతీయులే అధికం
విదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్‌వైఫరీ రిజిస్టర్ బోర్డ్ ఐర్లాండ్‌లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
విద్యార్హతలునర్సింగ్ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్ నర్సింగ్ కౌన్సెల్‌లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి.
విదేశాలు వెళ్లాలంటే...
ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ వంటి ల్యాంగ్వేజ్ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్‌ఎన్‌బీ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది.
భారత్‌లో కొరత
ఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.
ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment