Nursing Colleges
-
విదేశాల వైపు.. నర్సుల చూపు
రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్లను నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ కళాశాలల్లో వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో 2,821 వెరిఫికేషన్లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,662 వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. – సాక్షి, అమరావతివైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషియువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్‌వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలుభారత్ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తున్నట్టు నర్సులు చెబుతున్నారు. అదే యూఎస్ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్‌లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది. యూకేలో భారతీయులే అధికంవిదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్వైఫరీ రిజిస్టర్ బోర్డ్ ఐర్లాండ్‌లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విద్యార్హతలునర్సింగ్ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్ నర్సింగ్ కౌన్సెల్లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి. విదేశాలు వెళ్లాలంటే...ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ వంటి ల్యాంగ్వేజ్ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్ఎన్బీ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది. భారత్‌లో కొరతఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య -
నర్సుల సంఖ్యలో మన స్థానం 14
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించడంలో, వైద్య సంబంధిత విధుల్లో నర్సులు, ఏఎన్ఎంలది కీలకపాత్ర. ఇలాంటి నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో.. సంబంధిత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తమ వార్షిక నివేదిక–2021–22ను విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా 1.39 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ 1.10 లక్షల మందితో రెండో స్థానంలో ఉంది. ఇక 10,219 మందితో తెలంగాణ 19వ స్థానంలో ఉంది. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నా రు. అత్యధికంగా 3.32 లక్షల మందితో తమిళనా డు మొదటి స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానం (3.15 లక్షల మంది)లో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ( 2.62 లక్షల మంది)లో ఉన్నాయి. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో నిలిచింది. నర్సింగ్ సీట్లలో కర్ణాటక నం.1 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ల సంఖ్యలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 19,860 సీట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ 8,030 బీఎస్సీ సీట్లతో ఐదో స్థానంలో ఉండగా, తెలంగాణ 4,980 సీట్లతో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఎంఎస్సీ నర్సింగ్‌లో తెలంగాణ 493 సీట్లతో దేశంలో పదో స్థానంలో ఉండగా, ఏపీ ఏడో స్థానంలో ఉంది. 3,360 సీట్లతో కర్ణాటక ఎంఎస్సీ నర్సింగ్‌లోనూ మొదటి స్థానంలో నిలిచింది. కొత్త కోర్సులు..సెమిస్టర్ విధానం.. నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునీకరణల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను తీసుకొచ్చింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేషన్ కోర్సులో పేషెంట్ సెంటర్డ్ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. ‘హెల్త్ కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి..’అని సూచించింది. ఏఎన్ఎం సీట్లలో ఆంధ్రప్రదేశ్ టాప్.. ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లలో తెలంగాణ దేశంలో 17వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 455 ఏఎన్ఎం సీట్లు ఉన్నాయి. అత్యధికంగా 12,015 సీట్లతో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 910 సీట్లతో 12వ స్థానంలో నిలిచింది. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 520 ఉన్నాయి. -
157 నర్సింగ్ కాలేజీలు
న్యూఢిల్లీ: ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా రూ.1,570 కోట్ల వ్యయంతో నూతనంగా 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంబంధిత కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలో చెప్పారు. ‘కొత్త కాలేజీల రాకతో ఏటా దాదాపు 15,700 కొత్త నర్సింగ్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ కాలేజీలు 100 బీఎస్సీ(నర్సింగ్) సీట్లు ఉంటాయి. మొత్తం 157కుగాను యూపీలో 27, రాజస్థాన్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 14, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో చెరో 11 , కర్ణాటకలో నాలుగు కాలేజీలు నెలకొల్పుతాం’ అని మాండవీయ చెప్పారు. బ్రిటన్‌లో 26 వేల మంది, అమెరికాలో 16వేల మంది, ఆస్ట్రేలియాలో 12వేల మంది, గల్ఫ్ దేశాల్లో 20వేల మంది భారతీయ నర్సులు సేవలందిస్తున్నారు. -
ఆర్టీసీకి సొంతంగా నర్సింగ్ కళాశాల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన ఈ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు మొదలయ్యాయి. ఈ కళాశాలకు ప్రభుత్వం 50 సీట్లను కేటాయించింది. ఇందులో 30 సీట్లను కన్వీనర్ కోటాగా ఉంచి, ఒక్కో సీటుకు రూ.27 వేల ఫీజు నిర్ధారించింది. ఇక మేనేజ్మెంట్ కోటాగా 17 సీట్లను కేటాయించి రూ.87 వేలు చొప్పున ఫీజును నిర్ధారించింది. అడ్మిషన్ రుసుముగా రూ.10 వేలు, ఇతరాలకు రూ.3 వేలు కలిపి ఈ కోటా కింద ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ సిబ్బంది కోటాగా 3 సీట్లను రిజర్వ్ చేశారు. సిబ్బంది పిల్లలకు వీటిని కేటాయిస్తారు. ఒకవేళ సిబ్బంది పిల్లల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. కన్వీనర్ కోటా సీట్లను రెండు కౌన్సెలింగ్‌ల ద్వారా ఇప్పటికే భర్తీ చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థుల భర్తీ జరగనప్పటికీ సోమవారం నుంచి తరగతులు ప్రారంభించారు. -
నా శవంపై నర్సింగ్ కాలేజీ కట్టండి: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: పేదల ఇళ్ల కోసం గద్వాలలో సేకరించిన భూమిని ముట్టు కుంటే వారి ఉసురు తగులుతుందని, తన శవంపై నర్సింగ్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. 2012లో పేదల ఇళ్ల కోసం 78 ఎకరాల పట్టా భూమిని తాము సేకరించి ప్రభుత్వానికిచ్చామని తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం అన్యాయమన్నారు. మంత్రి హరీశ్‌రావు దొంగతనంగా గద్వాల వచ్చి నర్సింగ్ కాలేజీకి ఫౌండేషన్ వేశారని ఆరోపించారు. గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్, హరీశ్‌రావులకు లేదన్నారు. హరీశ్ గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని, యూనిఫాం వేసుకున్న పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్‌లను లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
‘ఆర్అండ్బీ’కి మెడికల్ ప్రాజెక్టులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో తలమునకలై ఉన్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట నుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రు లు, ఏడు మెడికల్ కాలేజీలు, 13 నర్సింగ్ కాలే జీలను నిర్మించాలని ఇటీవలే కేబినెట్ నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించి త్వర లో ఆర్ అండ్ బీ స్థలాల పరిశీలన ప్రారంభించ నుంది. ఆ తర్వాత డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే మెడికల్ ప్రాజెక్టు పూర్తి కోసం ఖాళీలు భర్తీ చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పలు కేటగిరీలకు చెందిన 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది. నిర్మించాల్సిన కొత్త మెడికల్ కాలేజీలు.. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు కొత్త నర్సింగ్ కళాశాలలు: సంగారెడ్డి, మహబూ బాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు: వరంగల్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలం, అల్వాల్–ఓఆర్ఆర్ మధ్య. -
ఒకేసారి వైద్య కాలేజీల అనుమతికి యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్, 13 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వైద్య రంగం మరింత బలోపేతం కానుంది. అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచే ఆయా కాలేజీలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అవసరమైన అనుమతులు పొందేందుకు కేంద్రానికి దరఖాస్తు చేసేందుకు కసరత్తు మొదలైందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేంద్రం నుంచి ఒకేసారి అనుమతులు సాధించేందుకు అవసరమైతే ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని యోచిస్తున్నారు. కాలేజీలకు అనుమతి వచ్చాక సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు. 1,050 ఎంబీబీఎస్.. 1,300 నర్సింగ్ సీట్లు రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తంగా 1,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 8 ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుండగా, వాటిల్లో 320 సీట్లున్నాయి. కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలతో 1,050 ఎంబీబీఎస్ సీట్లు, 13 నర్సింగ్ కాలేజీలతో 1,300 నర్సింగ్ సీట్లు రానున్నాయి. దీంతో ప్రభుత్వంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,650కు చేరుకుంటాయి. నర్సింగ్‌లో సర్కారుసీట్లు 1,620కు చేరుకుంటాయి. ప్రైవేట్‌లో ఇప్పటికే భారీగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలో మరిన్ని సీట్లు పెరగడం వల్ల ఆయా కోర్సులు చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ సేవలు.. మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల వాటి అనుబంధ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కొత్త కాలేజీలతో ఆయా ప్రాంత ప్రజలకు బోధనాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మున్ముందు పీజీ సీట్లు లభిస్తే స్పెషాలిటీ వైద్య సేవలు గ్రామీణ పేదలకు లభిస్తాయి. నర్సింగ్ కాలేజీలు ఏర్పడితే ఆస్పత్రుల్లో నాణ్యమైన నర్సింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. -
ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట విధులనూ కేటాయించాడు. ఇలా రెండు నెలలపాటు 24 మంది నకిలీ ఉద్యోగులను ఆస్పత్రిలో విధుల్లో కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించాడు. ఇంజిక్షన్ ఇవ్వడం రాకపోవడంతో గుర్తించాడు. అతడిని నిలదీయగా అసలు తతంగం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ అనే వ్యక్తి పలువురు యువతి, యువకులకు ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఒ క్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా 24 మంది నుంచి డబ్బు లు వసూలు చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు కేటాయించాడు. వార్డుల్లో వీరికి ఆప్రాన్ లు ధరించి సాధారణ నర్సింగ్ విద్యార్థులతో ఆస్పత్రిలో పని చేయించాడు. 24 మందికి మొద ట నర్సింగ్ శిక్షణనిస్తామని అనంతరం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించాడు. వీరికి ప్రతి రోజు హాజరు తీసుకోవడం, గ్రీన్ పెన్ను తో సంతకం చేయడం వంటి తతంగం నడిపించాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు అత్యవసర విభాగంలో రోగికి ఇంజిక్షన్ ఇచ్చే విషయంలో అనుమానం రావడంతో నర్సింగ్ విద్యార్థిని ప్రశ్నించారు. సతీష్ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టాడని వారు తెలిపారు. ‘ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మీరు ఎలా వచ్చార’ని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. ఇలా ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా పది మందిని గుర్తించారు. మరో 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడైంది. అనంతరం సూపరింటెండెంట్ ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రేక్షక పాత్ర..? ఏడంతస్తుల భవనంలో ఏమి జరుగుతుందన్నది కనీసం గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఆరు నర్సింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తారు. వీరు ఏ కళాశాలకు చెందినవారు ఎంత మంది వస్తున్నారు, వారి ట్యూటర్ వివరాలేంటి అన్నది కూడా సమాచారం లేదు. దీంతో ఆయా వార్డుల్లో నర్సింగ్ విద్యార్థులు ఏ కళాశాలకు చెందిన వారు, లేదా ప్రైవేట్‌కు చెందినవారా అనే అంశాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సతీష్ అనే వ్యక్తి 24 మంది యువతి, యువకులను నర్సింగ్ విద్యార్థుల పేరిట ఆస్పత్రిలో కొనసాగించాడు. నర్సింగ్ శిక్షణ లేని బయటి వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి రోగులకు ఇంజిక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నారు. ఆస్పత్రిలోని 32 వార్డుల్లో ప్రతి వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు నర్సింగ్ సిబ్బంది ఉంటారు. స్టాఫ్‌నర్సు, వారి సహాయకులు సైతం ఉంటారు. వీరు కూడా నకిలీ ఉద్యోగులను గుర్తించలేకపోయారు. ఆస్పత్రికి ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు.. నకిలీ ఉద్యోగుల చలామణిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు విచారణ కమిటీని నియమించారు. వీరిని నియమించింది ఎవరు, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఆస్పత్రిలో ఎవరికైన సంబంధాలున్నాయా.. అనే అంశాలపై విచారించనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, కంటి వైద్యాధికారి భీంసింగ్, మరో ముగ్గురు ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో కేసునమోదైంది. పోలీసులువిచారిస్తున్నారు. అసలు సూత్రదారి గోపాలే.. జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలంలో గోపాలే సూత్రదారిగా ఉన్నట్లు తెలిసింది. గోపాల్ అనే వ్యక్తి వర్ని ప్రాంతానికి చెందినవాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను సతీష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం గోపాల్‌ను కలువగా వీరికి పరిచయం ఏర్పడింది. గోపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఉన్నాయని సతీష్‌కు చె ప్పాడు. వారి ద్వారా పరిచయస్తులను ఒక్కొక్కరిని ఉద్యోగాల పేరిట నమ్మించారు. వారి నిర్వహణ బాధ్యతను గోపాల్ సతీష్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. గోపాల్ నెలకు ఒక్కసారి మాత్రమే ఆస్పత్రికి వచ్చేవాడని, బాధితులకు గోపాల్ పేరు మాత్రమే తెలుసునని బాధితులు అంటున్నారు. మోసపోయిన యువకులు ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆనందంతో గంతులేశారు. ప్రైవేట్ వ్యక్తి ఉద్యోగుల పేరిట మోసం చేయడాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి నకిలీ ఉద్యోగంలో చేరారు. తీరా మోసం జరిగిందని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. పది మందిని పోలీసులు విచారించగా ఆస్పత్రిలో ఉద్యోగం అనగానే సంతోషపడ్డామని ప్రతి రోజు వార్డుల్లో శిక్షణ ఇవ్వడంతో సతీష్ మాటలు నమ్మనట్లు తెలిపారు. తీరా పోలీసుల విచారణలో నమ్మించి మోసం చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఉద్యోగాల పేరిట వలవేసిన సతీష్ అతడి చెల్లెలు, బంధువు కూడా ఈ నకిలీ ఉద్యోగాల్లో చేరారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, బోధన్, వర్ని మండలం చింతకుంట, జగిత్యాల, సిరిసిల్లా జిల్లా రుద్రాంగి, నిజామాబాద్‌కు చెందిన వారిద్దరు, మాక్లూర్ మండలానికి చెందిన ఇద్దరు, ఆర్మూర్‌కు చెందిన వారు మరొకరు ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు చేసిన బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసానికి గురయ్యామని క్రాంతి అనే వ్యక్తి బుధవారం ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సతీష్ అనే వ్యక్తికి ఐదుగురం డబ్బులు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సింగ్ కాలేజీల సమస్యల పరిష్కారానికి కమిటీ
► నివేదికను సమర్పించేందుకు 15 రోజుల గడువు.. హైదరాబాద్: నర్సింగ్ కళాశాలల్లోని సమ స్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని వైద్యా రోగ్యశాఖ నిర్ణయించింది. 15 రోజుల్లో కమిటీ నివే దిక ఇచ్చేలా గడువు విధించాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. గురువారం వెంగళరావు నగర్‌లోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్షించారు. డిగ్రీ, జీఎన్ఎం వంటి చదువుల ద్వారా నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రకరకాల సమస్యలు నెలకొన్నాయి. వాటితో పాటు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అకడ మిక్ వ్యవహారాల వంటి వాటి మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని ఆదేశించారు. పాలమూరు వైద్యకళాశాలకు ఎల్ఓపీ.. పాలమూరు వైద్య కళాశాలకు రెండో ఏడాది కూడా లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) లభించింది. సమావేశంలో దీనిపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలె క్టర్లు, డీఎం,హెచ్ఓ సంబంధిత శాఖల ఉన్నతా ధికారులు సమన్వ యంతో సమస్యలను అధిగమిం చాలని సూచించారు. ఈ సమావేశంలో పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్, డీఎం ఈ రమణి, డీహెచ్ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ... గ్రామీణ వైద్యులకు గతంలో ప్రారంభించిన శిక్షణ వివిధ స్థాయిల్లో ఆగిపోయింది. దీంతో మళ్లీ శిక్షణ షెడ్యూల్ సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 శిక్షణ కేంద్రాలున్నాయి. వాటికి అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయా లని, పది రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారు. -
మరో 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు
► మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఏర్పాటు ► కొత్తగా నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఈ మూడు కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీలో 50 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు బీఎస్సీ నర్సింగ్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 280 సీట్లున్నాయి. ఉస్మానియాలో ఎంఎస్సీ నర్సింగ్ ఉంది. అందులో 30 సీట్లున్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు ఆధ్వర్యంలో 9 ఎంఎస్సీ నర్సింగ్ కాలేజీలు, 60 ప్రైవేటు కాలేజీలున్నాయి. అవి కాకుండా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) ప్రభుత్వ కాలేజీలు 6,126 ప్రైవేటు కాలేజీలున్నాయి. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఎంపీహెచ్ఎస్) కోర్సుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు కాలేజీలు, 113 ప్రైవేటు కాలేజీలున్నాయి. అధ్యాపకుల్లేక కుప్పకూలిన నర్సింగ్ విద్య దాదాపు 15 కార్పొరేట్ నర్సింగ్ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన చోట్ల నర్సింగ్ విద్య కుప్పకూలింది. అర్హులైన అధ్యాపకుల్లేకపోవడంతో కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో వైద్య రంగమే ప్రమాదంలో పడుతోంది. భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) నిబంధనల ప్రకారం 40 నుంచి 60 సీట్లు ఉంటే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు అసిస్టెంటు ప్రొఫెసర్లు ఉండాలి. అలాగే 13 నుంచి 18 మంది ట్యూటర్లు ఉండాలి. అయితే చాలా కాలేజీల్లో క్లినికల్ సైడ్‌లో ఉన్న వారితో నడిపించేస్తున్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో వందల్లో సీట్లు ఉంటే.. ప్రైవేటు కాలేజీల్లో వేలాది సీట్లు ఉన్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఐఎన్‌సీ ఇష్టారాజ్యంగా నర్సింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. దాదాపు 90 శాతం నర్సింగ్ కాలేజీలకు అధ్యాపకులే లేరు. వాటికి సరిపడా బిల్డింగ్లు, తరగతి గదులు కూడా లేవు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని పరీక్షలు రాయిస్తారన్న విమర్శలున్నాయి. దీంతో నర్సింగ్ విద్యపై త్వరలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
గుంటూరు,శ్రీకాకుళంలో నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, గుంటూరులో ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. శ్రీకాకుళంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, గుంటూరులో ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ డెరైక్టర్ జూలై 28న సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వీటిపై ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం శ్రీకాకుళంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు రూ.20 కోట్లు, గుంటూరు సర్వజనాసుపత్రిలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు మరో రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.