సాక్షి, హైదరాబాద్: పేదల ఇళ్ల కోసం గద్వాలలో సేకరించిన భూమిని ముట్టు కుంటే వారి ఉసురు తగులుతుందని, తన శవంపై నర్సింగ్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. 2012లో పేదల ఇళ్ల కోసం 78 ఎకరాల పట్టా భూమిని తాము సేకరించి ప్రభుత్వానికిచ్చామని తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం అన్యాయమన్నారు.
మంత్రి హరీశ్‌రావు దొంగతనంగా గద్వాల వచ్చి నర్సింగ్ కాలేజీకి ఫౌండేషన్ వేశారని ఆరోపించారు. గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్, హరీశ్‌రావులకు లేదన్నారు. హరీశ్ గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని, యూనిఫాం వేసుకున్న పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్‌లను లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు టీఆర్‌ఎస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment