ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది? | Fake Nursing Staff In NIzamabad General Hospital | Sakshi
Sakshi News home page

ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది?

Published Thu, Mar 21 2019 3:11 PM | Last Updated on Thu, Mar 21 2019 3:13 PM

Fake Nursing Staff In NIzamabad General Hospital - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట విధులనూ కేటాయించాడు. ఇలా రెండు నెలలపాటు 24 మంది నకిలీ ఉద్యోగులను ఆస్పత్రిలో విధుల్లో కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించాడు. ఇంజిక్షన్‌ ఇవ్వడం రాకపోవడంతో గుర్తించాడు. అతడిని నిలదీయగా అసలు తతంగం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే... 
మాక్లూర్‌ మండలం గుత్పకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి పలువురు యువతి, యువకులకు ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఒ క్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా 24 మంది నుంచి డబ్బు లు వసూలు చేసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో విధులు కేటాయించాడు. వార్డుల్లో వీరికి ఆప్రాన్‌ లు ధరించి సాధారణ నర్సింగ్‌ విద్యార్థులతో ఆస్పత్రిలో పని చేయించాడు. 24 మందికి మొద ట నర్సింగ్‌ శిక్షణనిస్తామని అనంతరం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించాడు. వీరికి ప్రతి రోజు హాజరు తీసుకోవడం, గ్రీన్‌ పెన్ను తో సంతకం చేయడం వంటి తతంగం నడిపించాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు అత్యవసర విభాగంలో రోగికి ఇంజిక్షన్‌ ఇచ్చే విషయంలో అనుమానం రావడంతో నర్సింగ్‌ విద్యార్థిని ప్రశ్నించారు. సతీష్‌ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టాడని వారు తెలిపారు. ‘ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మీరు ఎలా వచ్చార’ని సూపరింటెండెంట్‌ ప్రశ్నించారు. ఇలా ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా పది మందిని గుర్తించారు. మరో 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడైంది. అనంతరం సూపరింటెండెంట్‌ ఒకటో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల ప్రేక్షక పాత్ర..? 
ఏడంతస్తుల భవనంలో ఏమి జరుగుతుందన్నది కనీసం గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి ఆరు నర్సింగ్‌ కళాశాలల నుంచి విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తారు. వీరు ఏ కళాశాలకు చెందినవారు ఎంత మంది వస్తున్నారు, వారి ట్యూటర్‌ వివరాలేంటి అన్నది కూడా సమాచారం లేదు. దీంతో ఆయా వార్డుల్లో నర్సింగ్‌ విద్యార్థులు ఏ కళాశాలకు చెందిన వారు, లేదా ప్రైవేట్‌కు చెందినవారా అనే అంశాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సతీష్‌ అనే వ్యక్తి 24 మంది యువతి, యువకులను నర్సింగ్‌ విద్యార్థుల పేరిట ఆస్పత్రిలో కొనసాగించాడు. నర్సింగ్‌ శిక్షణ లేని బయటి వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి రోగులకు ఇంజిక్షన్‌ ఇస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నారు. ఆస్పత్రిలోని 32 వార్డుల్లో ప్రతి వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు నర్సింగ్‌ సిబ్బంది ఉంటారు. స్టాఫ్‌నర్సు, వారి సహాయకులు సైతం ఉంటారు. వీరు కూడా నకిలీ ఉద్యోగులను గుర్తించలేకపోయారు. ఆస్పత్రికి ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు, ప్రైవేట్‌ వ్యక్తులు ప్రవేశిస్తున్నారు.

విచారణ కమిటీ ఏర్పాటు.. 
నకిలీ ఉద్యోగుల చలామణిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు విచారణ కమిటీని నియమించారు. వీరిని నియమించింది ఎవరు, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఆస్పత్రిలో ఎవరికైన సంబంధాలున్నాయా.. అనే అంశాలపై విచారించనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్, కంటి వైద్యాధికారి భీంసింగ్, మరో ముగ్గురు ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఒకటో టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసునమోదైంది. పోలీసులువిచారిస్తున్నారు.

అసలు సూత్రదారి గోపాలే..
జనరల్‌ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలంలో గోపాలే సూత్రదారిగా ఉన్నట్లు తెలిసింది. గోపాల్‌ అనే వ్యక్తి వర్ని ప్రాంతానికి చెందినవాడు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను సతీష్‌ అనే వ్యక్తి ఉద్యోగం కోసం గోపాల్‌ను కలువగా వీరికి పరిచయం ఏర్పడింది. గోపాల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఉన్నాయని సతీష్‌కు చె ప్పాడు. వారి ద్వారా పరిచయస్తులను ఒక్కొక్కరిని ఉద్యోగాల పేరిట నమ్మించారు. వారి నిర్వహణ బాధ్యతను గోపాల్‌ సతీష్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. గోపాల్‌ నెలకు ఒక్కసారి మాత్రమే ఆస్పత్రికి వచ్చేవాడని, బాధితులకు గోపాల్‌ పేరు మాత్రమే తెలుసునని బాధితులు అంటున్నారు.

మోసపోయిన యువకులు
ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆనందంతో గంతులేశారు. ప్రైవేట్‌ వ్యక్తి ఉద్యోగుల పేరిట మోసం చేయడాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి నకిలీ ఉద్యోగంలో చేరారు. తీరా మోసం జరిగిందని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. పది మందిని పోలీసులు విచారించగా ఆస్పత్రిలో ఉద్యోగం అనగానే సంతోషపడ్డామని ప్రతి రోజు వార్డుల్లో శిక్షణ ఇవ్వడంతో సతీష్‌ మాటలు నమ్మనట్లు తెలిపారు. తీరా పోలీసుల విచారణలో నమ్మించి మోసం చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఉద్యోగాల పేరిట వలవేసిన సతీష్‌ అతడి చెల్లెలు, బంధువు కూడా ఈ నకిలీ ఉద్యోగాల్లో చేరారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, బోధన్, వర్ని మండలం చింతకుంట, జగిత్యాల, సిరిసిల్లా జిల్లా రుద్రాంగి, నిజామాబాద్‌కు చెందిన వారిద్దరు, మాక్లూర్‌ మండలానికి చెందిన ఇద్దరు, ఆర్మూర్‌కు చెందిన వారు మరొకరు ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫిర్యాదు చేసిన బాధితుడు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసానికి గురయ్యామని క్రాంతి అనే వ్యక్తి బుధవారం ఒకటో టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సతీష్‌ అనే వ్యక్తికి ఐదుగురం డబ్బులు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement