Fake employees
-
Karimnagar: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! ‘పట్టుకోండి చూద్దాం’ పార్ట్–3
సాక్షి, కరీంనగర్: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! అన్న పాట.. ఇటీవల ఓ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ.. తనను ఎవరూ ఏమీ చేయలేరని వెక్కిరిస్తూ.. సదరు విలన్ అహంకారంతో పాడే సందర్భం అది. 34 ఏళ్ల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో అక్రమంగా కొలువు సాధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కూడా ఇదే పాట పాడుతూ.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఇటీవల సదరు అధికారి బాగోతాలను బయటపెడుతూ ‘సాక్షి’ రాసిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తనపై ఎన్ని విచారణలు వేసినా.. ‘తగ్గేదే లే..’ అంటున్న సదరు అక్రమార్కుడు ఉన్నతాధికారులపై ఎదురుదాడికి సిద్ధమవుతూ కీలక ఆధారాలు మాయం చేసే పనిలో ఉండటం పంచాయతీరాజ్ కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ లెక్క చేయకుండా సాగుతున్న అధికారి వ్యవహారం తాజాగా అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎదురుదాడికి సిద్ధం..! ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. తనపై విచారణ వేశారని తెలియగానే.. ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని బాధ్యతగా అందజేస్తారు. కానీ, ఈ అధికారి మాత్రం విజిలెన్స్‌కు చేరిన ఫైల్‌ను తొక్కిపెట్టడంలో విజయవంతమవుతున్నాడన్న ప్రచారం అతడికి కార్యాలయంలో ఉన్న పట్టును తెలియజేస్తోంది. వాస్తవానికి సదరు అధికారి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి మరణించాడని కారుణ్య నియామక కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో సదరు అధికారి కొలువు సాధించాడు. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లో పలు హోదాల్లో పనిచేశాడు. ఇతడి నియామకం చట్ట విరుద్ధమంటూ తోటి ఉద్యోగులంతా గతంలోనే ఈఎన్సీకి ఫిర్యాదు చేశారు. అయినా తన తెలివితేటలతో విచారణను నిలిపివేయించుకున్నాడు. ఇటీవల ‘సాక్షి’ ఈ అధికారి లీలలను ‘పట్టుకోండి చూద్దాం’ అన్న శీర్షికన అతడి తల్లి ఫించన్ వివరాలు, ఆమెను ప్రభుత్వ ఉద్యోగి అంటూ ప్రస్తావించిన కోర్టు తీర్పు కాపీని ప్రచురించిన విషయం తెలిసిందే. అదే సమయంలో సదరు అధికారి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కోసం డిపొ్లమా (మెకానికల్), బీటెక్ (సివిల్) విద్యను ఎలా (రెగ్యులరా/ దూరవిద్య) చదివాడు? ఎవరు అనుమతించారు? ఏయే దినాల్లో సెలవుపెట్టాడు? అన్న పాయింట్లను లేవనెత్తింది. దీంతో ఆయా ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కరీంనగర్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ఇక్కడే సదరు అధికారి చక్రం తిప్పుడుతున్నారు. ఇప్పుడే సర్వీసు రికార్డుకు సంబంధించిన పలు కీలక ఫైళ్లు మాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘనుడు.. తాజాగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవద్దని సదరు ఆదేశాలు అందుకున్న అధికారిని మేనేజ్ చేయడంలో సఫలీకృతుడు అయ్యాడన్న ప్రచారం మొదలైంది. ఈ విషయం పంచాయతీరాజ్ విభాగంలో దుమారం రేపుతోంది. చదవండి: ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. అక్రమార్క అధికారికి మరో అధికారి తోడవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అవునా? కాదా?, అతడి సర్టిఫికెట్ల విషయంలో వాస్తవమెంత? అంటూ ఉన్నతాధికారులు సంధించిన ప్రశ్నలకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు వెళ్తుందా? లేక సదరు అక్రమార్కుడే పైచేయి సాధిస్తాడా? అన్న విషయంపై నేడు స్పష్టతరానుంది. జెడ్పీలో అధికారి సస్పెన్షన్ ! జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న అధికారి కూడా నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలపై సస్పెండ్ కావడం కలకలం రేపుతోంది. విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని ఓ జూనియర్ అసిస్టెంట్‌కు అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలపై ఆయనకు కొంతకాలంగా ఇంక్రిమెంట్లలోనూ కోత విధించిన అధికారులు తాజాగా సస్పెండ్ చేయడం గమనార్హం. వేములవాడలో పనిచేసే సదరు అధికారిని ఇటీవల 317 జీవో అమలులో భాగంగా కరీంనగర్‌కు కేటాయించారు. ఇతడి సర్టిఫికెట్లపై విచారణ జరిపిన అధికారులు ఎట్టకేలకు అవి నకిలీవని తేలడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. -
ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట విధులనూ కేటాయించాడు. ఇలా రెండు నెలలపాటు 24 మంది నకిలీ ఉద్యోగులను ఆస్పత్రిలో విధుల్లో కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించాడు. ఇంజిక్షన్ ఇవ్వడం రాకపోవడంతో గుర్తించాడు. అతడిని నిలదీయగా అసలు తతంగం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ అనే వ్యక్తి పలువురు యువతి, యువకులకు ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఒ క్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా 24 మంది నుంచి డబ్బు లు వసూలు చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు కేటాయించాడు. వార్డుల్లో వీరికి ఆప్రాన్ లు ధరించి సాధారణ నర్సింగ్ విద్యార్థులతో ఆస్పత్రిలో పని చేయించాడు. 24 మందికి మొద ట నర్సింగ్ శిక్షణనిస్తామని అనంతరం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించాడు. వీరికి ప్రతి రోజు హాజరు తీసుకోవడం, గ్రీన్ పెన్ను తో సంతకం చేయడం వంటి తతంగం నడిపించాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు అత్యవసర విభాగంలో రోగికి ఇంజిక్షన్ ఇచ్చే విషయంలో అనుమానం రావడంతో నర్సింగ్ విద్యార్థిని ప్రశ్నించారు. సతీష్ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టాడని వారు తెలిపారు. ‘ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మీరు ఎలా వచ్చార’ని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. ఇలా ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా పది మందిని గుర్తించారు. మరో 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడైంది. అనంతరం సూపరింటెండెంట్ ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రేక్షక పాత్ర..? ఏడంతస్తుల భవనంలో ఏమి జరుగుతుందన్నది కనీసం గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఆరు నర్సింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తారు. వీరు ఏ కళాశాలకు చెందినవారు ఎంత మంది వస్తున్నారు, వారి ట్యూటర్ వివరాలేంటి అన్నది కూడా సమాచారం లేదు. దీంతో ఆయా వార్డుల్లో నర్సింగ్ విద్యార్థులు ఏ కళాశాలకు చెందిన వారు, లేదా ప్రైవేట్‌కు చెందినవారా అనే అంశాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సతీష్ అనే వ్యక్తి 24 మంది యువతి, యువకులను నర్సింగ్ విద్యార్థుల పేరిట ఆస్పత్రిలో కొనసాగించాడు. నర్సింగ్ శిక్షణ లేని బయటి వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి రోగులకు ఇంజిక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నారు. ఆస్పత్రిలోని 32 వార్డుల్లో ప్రతి వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు నర్సింగ్ సిబ్బంది ఉంటారు. స్టాఫ్‌నర్సు, వారి సహాయకులు సైతం ఉంటారు. వీరు కూడా నకిలీ ఉద్యోగులను గుర్తించలేకపోయారు. ఆస్పత్రికి ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు.. నకిలీ ఉద్యోగుల చలామణిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు విచారణ కమిటీని నియమించారు. వీరిని నియమించింది ఎవరు, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఆస్పత్రిలో ఎవరికైన సంబంధాలున్నాయా.. అనే అంశాలపై విచారించనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, కంటి వైద్యాధికారి భీంసింగ్, మరో ముగ్గురు ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో కేసునమోదైంది. పోలీసులువిచారిస్తున్నారు. అసలు సూత్రదారి గోపాలే.. జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలంలో గోపాలే సూత్రదారిగా ఉన్నట్లు తెలిసింది. గోపాల్ అనే వ్యక్తి వర్ని ప్రాంతానికి చెందినవాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను సతీష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం గోపాల్‌ను కలువగా వీరికి పరిచయం ఏర్పడింది. గోపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఉన్నాయని సతీష్‌కు చె ప్పాడు. వారి ద్వారా పరిచయస్తులను ఒక్కొక్కరిని ఉద్యోగాల పేరిట నమ్మించారు. వారి నిర్వహణ బాధ్యతను గోపాల్ సతీష్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. గోపాల్ నెలకు ఒక్కసారి మాత్రమే ఆస్పత్రికి వచ్చేవాడని, బాధితులకు గోపాల్ పేరు మాత్రమే తెలుసునని బాధితులు అంటున్నారు. మోసపోయిన యువకులు ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆనందంతో గంతులేశారు. ప్రైవేట్ వ్యక్తి ఉద్యోగుల పేరిట మోసం చేయడాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి నకిలీ ఉద్యోగంలో చేరారు. తీరా మోసం జరిగిందని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. పది మందిని పోలీసులు విచారించగా ఆస్పత్రిలో ఉద్యోగం అనగానే సంతోషపడ్డామని ప్రతి రోజు వార్డుల్లో శిక్షణ ఇవ్వడంతో సతీష్ మాటలు నమ్మనట్లు తెలిపారు. తీరా పోలీసుల విచారణలో నమ్మించి మోసం చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఉద్యోగాల పేరిట వలవేసిన సతీష్ అతడి చెల్లెలు, బంధువు కూడా ఈ నకిలీ ఉద్యోగాల్లో చేరారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, బోధన్, వర్ని మండలం చింతకుంట, జగిత్యాల, సిరిసిల్లా జిల్లా రుద్రాంగి, నిజామాబాద్‌కు చెందిన వారిద్దరు, మాక్లూర్ మండలానికి చెందిన ఇద్దరు, ఆర్మూర్‌కు చెందిన వారు మరొకరు ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు చేసిన బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసానికి గురయ్యామని క్రాంతి అనే వ్యక్తి బుధవారం ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సతీష్ అనే వ్యక్తికి ఐదుగురం డబ్బులు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘నకిలీలు’
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో వైద్యులకు పట్టుబడడంతో దందా వెలుగు చూసింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో హల్చల్ చేసి వైద్యులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఒక్క ఈ ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. ఆస్పత్రిలో 240 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో 28 మంది లాంగ్లివ్లో ఉన్నారు. కొంతమందికి ఉద్యోగంతో పాటు ప్రైవేటు మందుల దుకాణాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉండడం.. మరికొంత మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు విధులకు హాజరుకాకపోగా వారి స్థానంలో ఇతరులకు తక్కువ మొత్తంలో నెలసరి వేతనాలు చెల్లించి ఆస్పత్రులకు పంపుతున్నారు. వీరిలో చాలా మందికి వైద్యంపై కనీస అవగాహన లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు అసలు ఆస్పత్రికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేసి, అకౌంట్లలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఇందుకు సహకరించిన హెల్త్ ఇన్స్పెక్టర్లకు భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నట్లు తెలిసింది. ఒకరి పేరుతో మరొకరు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, కింగ్‌కోఠి, మలక్‌పేట్, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు సహా మరో వందకు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30వేల మంది పని చేస్తున్నారు. పేషెంట్‌కేర్ ప్రొవైడర్స్ సహా శానిటేషన్ సెక్యురిటీ విభాగాల్లో మరో 10వేలకు పైగా సిబ్బంది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ ఏర్పాటు చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిని ఇట్టే గుర్తించడంతో పాటు వేతనాల చెల్లింపును నిలిపివేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రతిపాదికన పనిచేస్తూ నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులకు సీనియర్ ఆర్‌ఎంఓలు రోస్టర్, డ్యూటీలు వేసి, వారి హాజరును పర్యవేక్షిస్తుండగా... నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరును హెల్త్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. వీరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ విధులకు గైర్హాజరైన వారిని సైతం హాజరైనట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే ఉండరు... ప్రతిష్టాత్మక నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం నిలోఫర్‌లో ఉద్యోగుల విధి నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. నిత్యం వెయ్యి మంది చిన్నారులు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో 18 మంది ఆర్‌ఎంఓలు ఉన్నప్పటికీ.. ముగ్గురు మినహా మిగిలిన వారంతా వేళకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 10:30గంటల తర్వాత ఆస్పత్రికి రావడం, మధ్యాహ్నం 2గంటల తర్వాత వెళ్లడం వీరి పని. ఇక నైట్డ్యూటీలోనూ రెగ్యులర్ ఉద్యోగులు కన్పించడం లేదు. కీలకమైన విభాగాల్లోనూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందే దర్శనమిస్తున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు రోస్టర్ విధానంతో పాటు డ్యూటీలు వేయాల్సిన బాధ్యతతో పాటు రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరు నమోదు బాధ్యత హెల్త్ ఇన్స్పెక్టర్లపై ఉంది. కానీ ఇక్కడి హెల్త్ ఇన్స్పెక్టర్లు రాత్రి విధులకు గైర్హాజరవుతున్నారు. వారి స్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పని చేయిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. నవజాత శిశువులు చికిత్స పొందే కీలకమైన ఈ ఆస్పత్రితో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు కొనసాగు తోంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. -
ఇంతకీ వాళ్లేమైనట్టు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)లో నకిలీ ఉద్యోగులు ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 1,600 మంది ఉద్యోగులు మస్టర్ రోల్లోకే రాకపోవడంతో ఈ అనుమానం నానాటికీ బలపడుతోంది. గత ఏడాది అధికారికంగా ఉత్తర్వులు జారీచేసినప్పటికీ వేలిముద్రలు ఇచ్చేందుకు 2,200 మంది ఉద్యోగులు రానేలేదు. 14 వేలమంది మాత్రమే ఇచ్చారు. దీంతో ఈ విషయమై ఆరా తీసింది. దీంతో నాలుగు వందలమంది ఉద్యోగుల ఆచూకీ దొరికింది. దీంతో కనిపించని ఉద్యోగుల సంఖ్య 1,600లకు చేరుకుంది. కాగా ఈ సంస్థలో దాదాపు 15,600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. నకిలీ ఉద్యోగుల విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఏ అంశాన్ని కొట్టిపారేయలేమన్నారు. అసలేమి జరిగిందనేది అర్ధం కావడం లేదన్నారు. కాగా డీడీఏ తన సిబ్బందికి సంబంధించిన డాటాబేస్‌ను ఈ ఏడాది మేలో సరళం చేసింది. అంతేకాకుండా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతోపాటు వారికి ఏడు అంకెలతో కూడిన గుర్తింపుకార్డులను కూడా జారీచేసింది. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ తమ వేలిముద్రలను ఇవ్వాలని కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై బల్వీందర్ మాట్లాడుతూ సిబ్బంది వేలిముద్రలను గతంలో వికేంద్రీకరించామని, ఇప్పుడు ఒక్కచోటికే తీసుకొస్తున్నామన్నారు. నగరంలోని వికాస్ మినార్ ఐటీఓ, ద్వారక, రోహిణి, కీర్తినగర్, జనక్‌పురి తదితర ప్రాంతాల్లోనూ తమకు కార్యాలయాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్దకూడా రెండు కార్యాలయాలు ఉన్నాయన్నారు. అందువల్ల కొంతమంది తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయి ఉండొచ్చన్నారు. వీటిల్లో నాలుగుచోట్ల బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మొత్తం 125 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.