న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)లో నకిలీ ఉద్యోగులు ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 1,600 మంది ఉద్యోగులు మస్టర్ రోల్‌లోకే రాకపోవడంతో ఈ అనుమానం నానాటికీ బలపడుతోంది. గత ఏడాది అధికారికంగా ఉత్తర్వులు జారీచేసినప్పటికీ వేలిముద్రలు ఇచ్చేందుకు 2,200 మంది ఉద్యోగులు రానేలేదు. 14 వేలమంది మాత్రమే ఇచ్చారు. దీంతో ఈ విషయమై ఆరా తీసింది. దీంతో నాలుగు వందలమంది ఉద్యోగుల ఆచూకీ దొరికింది. దీంతో కనిపించని ఉద్యోగుల సంఖ్య 1,600లకు చేరుకుంది. కాగా ఈ సంస్థలో దాదాపు 15,600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు.
ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. నకిలీ ఉద్యోగుల విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఏ అంశాన్ని కొట్టిపారేయలేమన్నారు. అసలేమి జరిగిందనేది అర్ధం కావడం లేదన్నారు. కాగా డీడీఏ తన సిబ్బందికి సంబంధించిన డాటాబేస్‌ను ఈ ఏడాది మేలో సరళం చేసింది. అంతేకాకుండా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతోపాటు వారికి ఏడు అంకెలతో కూడిన గుర్తింపుకార్డులను కూడా జారీచేసింది. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ తమ వేలిముద్రలను ఇవ్వాలని కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది.
ఈ విషయమై బల్వీందర్ మాట్లాడుతూ సిబ్బంది వేలిముద్రలను గతంలో వికేంద్రీకరించామని, ఇప్పుడు ఒక్కచోటికే తీసుకొస్తున్నామన్నారు. నగరంలోని వికాస్ మినార్ ఐటీఓ, ద్వారక, రోహిణి, కీర్తినగర్, జనక్‌పురి తదితర ప్రాంతాల్లోనూ తమకు కార్యాలయాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్దకూడా రెండు కార్యాలయాలు ఉన్నాయన్నారు. అందువల్ల కొంతమంది తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయి ఉండొచ్చన్నారు. వీటిల్లో నాలుగుచోట్ల బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మొత్తం 125 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఇంతకీ వాళ్లేమైనట్టు?
Published Sun, Sep 21 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement