న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన గృహనిర్మాణ పథకం-2014కు పదిలక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి సోమవారం ట్రయల్ డ్రా తీయనున్నారు. వాస్తవానికి ఈ నెల పదో తేదీనాడే డ్రా నిర్వహించాల్సి ఉంది. అయితే సోమవారం నాటి ట్రయల్ డ్రాకి వచ్చే స్పందననుబట్టి డ్రా తేదీని ప్రకటించాలని డీడీఏ నిర్ణయించిన సంగతి విదితమే. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘సోమవారం నాటి ఫలితాల,నుబట్టి డ్రా వాస్తవ తేదీని నిర్ణయిస్తాం. సోమవారం డ్రై (ట్రయల్ డ్రా) రన్ నిర్వహించనున్నాం. డ్రా నిర్వహణ విషయంలో మా సన్నద్ధత ఏవిధంగా ఉందనే విషయం తెలుసుకునేందుకే ఈ డ్రై రన్. డ్రై రన్‌లో ఎదురయ్యే ఇబ్బందులను గమనించి నిజమైన డ్రా నిర్వహించే సమయంలో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం’అని అన్నారు.
యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం
కాగా సోమవారంనాటి డ్రై రన్‌ను డీడీఏ... యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇలా డ్రైరన్‌నుప్రత్యక్ష ప్రసారం చేయనుండడం ఇదే తొలిసారి. డ్రైరన్‌ను నిర్వహిస్తే ఆ సమయంలో తలెత్తిన సమస్యలు రియల్ డ్రా సమయంలో పునరావృతం కాకుండా చూడొచ్చనేదే డీడీఏ ఆలోచన. యూట్యూబ్ వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ పథకానికి అనూహ్యరీతిలో స్పందన లభిస్తోంది. అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ అనేకమంది ఔత్సాహికులు ఈ పథకం గురించి తెలుసుకున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు.
వాస్తవానికి ఈ పథకానికి తుది గడువును అక్టోబర్ తొమ్మిదో తేదీగా డీడీఏ తొలుత ప్రకటించింది. అయితే అనూహ్య రీతిలో స్పందన రావడంతో దానిని మరలా అదే నెల 15వ తేదీకి పొడిగించింది. తొలిసారి ప్రకటించిన తుది గడువునాటికి డీడీఏకి 7.5 లక్షల దరఖాస్తులు అందాయి. గడువు ముగిసేనాటికి మొత్తం మొత్తం పది లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘దరఖాస్తుదారులు ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకుంటున్నారు. తమ దరఖాస్తు ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రా ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా మా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నాం’ అని అన్నారు. కాగా 2014-గృహ పథకం కింద వివిధ కేటగిరీల్లో డీడీఏ మొత్తం 25 వేల ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటి ఖరీదు రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్లవరకూ ఉంటుంది. ఇందుకోసం డీడీఏ అప్పట్లో మొత్తం 17 లక్షల బ్రోచర్లను ప్రచురించింది.
డ్రా కోసం ప్రత్యేక సర్వర్
2014 గృహనిర్మాణ పథకం డ్రా కోసం ప్రత్యేకంగా ఓ సర్వర్‌ను సిద్ధం చేయాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ బాధ్యతను సీ-డాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్) సంస్థకు అప్పగించింది. అయితే ఈ డ్రాను ఎక్కడ నిర్వహించాలనే విషయానికి సంబంధించి డీడీఏ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నోయిడాలోగానీ లేదా డీడీఏ ప్రధాన కార్యాలయమైన వికాస్ సదన్‌లోగానీ డ్రాని నిర్వహించే అవకాశముందని ఆ సంస్థ సంచాలకుడు వీఎస్ తొమర్ తెలిపారు. 2010లో నిర్వహించిన డ్రాకి కూడా సీడాక్ సంస్థ తనవంతు సహకారం అందించిన సంగతి విదితమే. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ అంతా సవ్యంగా సాగితే 250 సీట్ల సామర్థ్యం కలిగిన హాలులో డ్రాను నిర్వహిస్తాన్నారు. డ్రా కార్యక్రమాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రసారం చేయబోమని అన్నారు. ఇందుకు కారణం తమ వెబ్‌సైట్‌ను తిలకించే వారి సంఖ్య అధికంగా ఉండడమేనని, ఇందువల్ల ఈ వెబ్‌సైట్ మరోసారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చేయడమే తమ ఉద్దేశమన్నారు.
గృహ పథకానికి నేడు ట్రయల్ డ్రా
Published Sun, Nov 9 2014 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement