Nizamabad Government General Hospital
-
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మారని తీరు
నిజామాబాద్ సిటీ : జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి లో పేషెంట్ల పట్ల సిబ్బంది తీరు మారలేదు. ఆపరేషన్ అయిన బాలుడు ఇంటికి వెళ్తుండగా కేర్ టేకర్లు కనీసం పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి కడుపులో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. గురువారం బాలు డిని డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి గేట్ వరకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లవలసిన పేషంట్ కేర్ టేకర్ ఎవరూ అందుబాటులో లేకపోవటంతో బాలుడిని తల్లి గేట్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లింది. అదే సమయంలో వీల్‌చైర్‌లో ఆస్పత్రి సిబ్బంది వాటర్ బాటిల్‌ను తీ సుకెళ్లటం కనిపించింది. ఆస్పత్రిలో కేర్ టేకర్లు, వీల్ చైర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేదని పేషెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఆస్పత్రి వైద్యులు నాణ్యమైన సేవలందిస్తూ గుర్తింపు పొందుతుంటే సిబ్బంది మాత్రం రోగులతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. -
నిర్లక్ష్యం.. ఆస్పత్రిలో కరోనా మృతదేహలు తారుమారు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండానే తమకు చెందిన మృతదేహమే అనుకుని అంత్యక్రియలు నిర్వహించేశారు. తీరా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆరాతీసేసరికి అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అహ్మద్‌పురకాలనీకి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన మహిళ (78) కొవిడ్ తో బాధపడుతూ రెండ్రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. కాగా, ఇదే సమయంలో గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళ (65) కొవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు మృతదేహాలను ప్యాక్‌చేసి పోస్టుమార్టం గది పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన బంధువులెవరూ లేరు. గాయత్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మహిళ చనిపోయిందని గాయత్రినగర్ వాసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని పరిశీలించకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేశారు. అనంతరం మైనారిటీ వర్గం వారు వచ్చి తమ బంధువు మృతదేహం గురించి వెదకగా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి అధికారులు గాయత్రి నగర్ వాసులను పిలిపించారు. అక్కడ ఉన్న మృతదేహాలను మళ్లీ పరిశీలించగా గాయత్రినగర్ మహిళ మృతదేహం అక్కడే ఉంది. ఇంతకు ముందు తీసుకెళ్లిన మృతదేహాన్ని చూడలేదని తెలపడంతో మైనారిటీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, అడిషనల్ కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. రెండు వర్గాలను సముదాయించారు. దీంతో మైనారిటీ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మృతదేహం తారుమారుపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపడుతున్నారు. చదవండి: కరోనా టీకా వేయించుకున్న 105 ఏళ్ల బామ్మ -
ఆసుపత్రి నుంచి కరోనా అనుమానితుడి పరార్!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా ఆస్పత్రిలో సోమవారం కలకలం రేగింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా సదరు వ్యక్తి పరారు కావడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అసలేం జరిగిందంటే.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు (35) ఇటీవల మహారాష్ట్రలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న అతడు.. సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. మూడో అంతస్తులో పరీక్షించిన వైద్యులు జ్వరం, జలుబు, దగ్గు ఉండడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్లారు. (సూపర్ హీరోకి కరోనా ఎఫెక్ట్) కరోనా లక్షణాలు ఉన్నాయని, అతడ్ని ఐసోలేషన్ వార్డుకు పంపించాలని సూపరింటెండెంట్ సూచించారు. దీంతో అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తుండగా.. ఈ విషయం మా బంధువులకు చెప్తానని పక్కకు వెళ్లిన సదరు వ్యక్తి అక్కడి నుంచి అటే పరారయ్యాడు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది అతడి కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆస్పత్రి అధికారులు, సిబ్బంది హైరానా పడ్డారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావును వివరణ కోరగా.. ఇలాంటి ఘటన జరగలేదని తెలపడం గమనార్హం. (‘కోవిడ్’ కల్లోలం: సిటీ షట్ డౌన్!) -
పురిటిలోనే పసి ప్రాణం బలి
కమ్మర్పల్లి(బాల్కొండ): వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కమ్మర్‌పల్లికి చెందిన మల్లగారి రేణుక అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, స్టాఫ్ నర్సు, హెల్త్ సూపర్వైజర్ మాత్రమే ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. పేషెంట్ అవసరమైన(పొలీస్ క్యాథటర్) యూరిన్ పైప్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రిస్కిప్షన్‌పై రాసిచ్చారు. కమ్మర్పల్లి మందుల దుకాణాల్లో లేకపోవడంతో మెట్‌పల్లికి వెళ్లి తీసుకువచ్చారు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో వైద్య సిబ్బంది కాన్పు చేశారు. సహజ ప్రసవంతో మగ శిశువుకు జన్మించింది. పుట్టిన శిశువులో కదలికలు లేకపోవడంతో పాటు, నీలిరంగుగా మారడంతో శిశువును మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది కారణంగానే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. కాన్పు చేసిన హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ శిశువు ఉమ్మ నీరు మింగిందని ఒకసారి, మరోసారి తెమడ తట్టుకుందని పొంతన లేని మాటలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ అని నిలదీశారు. వైద్యాధికారి సెలవులో ఉంటే సంబంధిత రిజిస్టర్‌ను చూపించాలని పట్టుపట్టారు. పోలీసుల సమక్షంలో రిజిస్టర్ చూపించడంతో అందులో అటెండ్ బాక్స్ ఖాళీగా ఉంది. అర్హత కలిగిన వైద్యులు లేకపోవడంతో అనర్హత కలిగిన సిబ్బంది కాన్పు చేయడం కారణంగా శిశువు మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. ఘటనపై అనుమానాలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు స్థానిక తహసీల్దార్, ఎస్ఐలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. -
సంగారెడ్డిలో అపహరణ: ఎల్లారెడ్డిలో ప్రత్యక్షం
ఎల్లారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి అపహరణకు గురైన ఓ పాప ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్‌లో ప్రత్య క్షమైంది. అపహరణకు గురైన పాప ఆచూకీ లభించడంతో చిన్నారి తల్లితండ్రులు ఆనందంలో ము నిగారు. సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌కు చెందిన హన్మోజిగారి మల్లేశం తన భార్య మాధవిని ప్రస వం నిమిత్తం గత నెల 30న సంగారెడ్డిలోని మా తాశిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. సాధారణ ప్రసవంలో మాధవి పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన రెండు రోజులకు పాపకు కామెర్లు కావడంతో తిరిగి సంగారెడ్డి ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు పాపను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈనెల 7న ఆస్పత్రిలో కాంట్రాక్టు ఆయాగా పని చేస్తున్న వనిత కామెర్ల వ్యాధితో చికిత్స పొందిన శిశువును వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా ఇతరులకు అప్పగించింది. తమ శిశువును ఎత్తుకు పోయారన్న విషయాన్ని తెలుసుకున్న మాధవి, మల్లేషం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి శిశువు ను వెతికి అప్పగిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు పంపిచారు. చిన్నారి ఎల్లారెడ్డి మండలం శివానగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందం గురువారం ఎల్లారెడ్డికి వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. పాపను హరించిన బంగారు సంతోష్, శోభ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు శిశువుల మృతితో అపహరణ.. శివానగర్‌కు చెందిన బంగారు సంతోష్, శోభా దంపతులు తమ కూతురు కరుణను తన బావ కుమారుడు రవికి ఇచ్చి మేనరిక వివాహం చేశా రు. వారు గతేడాది మగబిడ్డకు జన్మనివ్వగా అత డు అనారోగ్యంతో మృతి చెందాడు. మళ్లీ 15 రో జుల క్రితం ఆడపిల్ల జన్మించగా అనారోగ్యానికి గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందింది. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని సంతోష్ పాప మృతి చెందితే తన కూతురు తట్టుకోలేదని సంగారెడ్డిలోని ఆరోగ్య కేంద్రం నుంచి పాపను అపహరించారు. సదరు పాప ఆచూకీని కనుగొన్న పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని నిందితులను సంగారెడ్డికి తీసుకుని వెళ్ళారు. -
ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట విధులనూ కేటాయించాడు. ఇలా రెండు నెలలపాటు 24 మంది నకిలీ ఉద్యోగులను ఆస్పత్రిలో విధుల్లో కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించాడు. ఇంజిక్షన్ ఇవ్వడం రాకపోవడంతో గుర్తించాడు. అతడిని నిలదీయగా అసలు తతంగం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ అనే వ్యక్తి పలువురు యువతి, యువకులకు ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఒ క్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా 24 మంది నుంచి డబ్బు లు వసూలు చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు కేటాయించాడు. వార్డుల్లో వీరికి ఆప్రాన్ లు ధరించి సాధారణ నర్సింగ్ విద్యార్థులతో ఆస్పత్రిలో పని చేయించాడు. 24 మందికి మొద ట నర్సింగ్ శిక్షణనిస్తామని అనంతరం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించాడు. వీరికి ప్రతి రోజు హాజరు తీసుకోవడం, గ్రీన్ పెన్ను తో సంతకం చేయడం వంటి తతంగం నడిపించాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు అత్యవసర విభాగంలో రోగికి ఇంజిక్షన్ ఇచ్చే విషయంలో అనుమానం రావడంతో నర్సింగ్ విద్యార్థిని ప్రశ్నించారు. సతీష్ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టాడని వారు తెలిపారు. ‘ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మీరు ఎలా వచ్చార’ని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. ఇలా ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా పది మందిని గుర్తించారు. మరో 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడైంది. అనంతరం సూపరింటెండెంట్ ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రేక్షక పాత్ర..? ఏడంతస్తుల భవనంలో ఏమి జరుగుతుందన్నది కనీసం గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఆరు నర్సింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తారు. వీరు ఏ కళాశాలకు చెందినవారు ఎంత మంది వస్తున్నారు, వారి ట్యూటర్ వివరాలేంటి అన్నది కూడా సమాచారం లేదు. దీంతో ఆయా వార్డుల్లో నర్సింగ్ విద్యార్థులు ఏ కళాశాలకు చెందిన వారు, లేదా ప్రైవేట్‌కు చెందినవారా అనే అంశాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సతీష్ అనే వ్యక్తి 24 మంది యువతి, యువకులను నర్సింగ్ విద్యార్థుల పేరిట ఆస్పత్రిలో కొనసాగించాడు. నర్సింగ్ శిక్షణ లేని బయటి వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి రోగులకు ఇంజిక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నారు. ఆస్పత్రిలోని 32 వార్డుల్లో ప్రతి వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు నర్సింగ్ సిబ్బంది ఉంటారు. స్టాఫ్‌నర్సు, వారి సహాయకులు సైతం ఉంటారు. వీరు కూడా నకిలీ ఉద్యోగులను గుర్తించలేకపోయారు. ఆస్పత్రికి ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు.. నకిలీ ఉద్యోగుల చలామణిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు విచారణ కమిటీని నియమించారు. వీరిని నియమించింది ఎవరు, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఆస్పత్రిలో ఎవరికైన సంబంధాలున్నాయా.. అనే అంశాలపై విచారించనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, కంటి వైద్యాధికారి భీంసింగ్, మరో ముగ్గురు ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో కేసునమోదైంది. పోలీసులువిచారిస్తున్నారు. అసలు సూత్రదారి గోపాలే.. జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలంలో గోపాలే సూత్రదారిగా ఉన్నట్లు తెలిసింది. గోపాల్ అనే వ్యక్తి వర్ని ప్రాంతానికి చెందినవాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను సతీష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం గోపాల్‌ను కలువగా వీరికి పరిచయం ఏర్పడింది. గోపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఉన్నాయని సతీష్‌కు చె ప్పాడు. వారి ద్వారా పరిచయస్తులను ఒక్కొక్కరిని ఉద్యోగాల పేరిట నమ్మించారు. వారి నిర్వహణ బాధ్యతను గోపాల్ సతీష్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. గోపాల్ నెలకు ఒక్కసారి మాత్రమే ఆస్పత్రికి వచ్చేవాడని, బాధితులకు గోపాల్ పేరు మాత్రమే తెలుసునని బాధితులు అంటున్నారు. మోసపోయిన యువకులు ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆనందంతో గంతులేశారు. ప్రైవేట్ వ్యక్తి ఉద్యోగుల పేరిట మోసం చేయడాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి నకిలీ ఉద్యోగంలో చేరారు. తీరా మోసం జరిగిందని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. పది మందిని పోలీసులు విచారించగా ఆస్పత్రిలో ఉద్యోగం అనగానే సంతోషపడ్డామని ప్రతి రోజు వార్డుల్లో శిక్షణ ఇవ్వడంతో సతీష్ మాటలు నమ్మనట్లు తెలిపారు. తీరా పోలీసుల విచారణలో నమ్మించి మోసం చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఉద్యోగాల పేరిట వలవేసిన సతీష్ అతడి చెల్లెలు, బంధువు కూడా ఈ నకిలీ ఉద్యోగాల్లో చేరారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, బోధన్, వర్ని మండలం చింతకుంట, జగిత్యాల, సిరిసిల్లా జిల్లా రుద్రాంగి, నిజామాబాద్‌కు చెందిన వారిద్దరు, మాక్లూర్ మండలానికి చెందిన ఇద్దరు, ఆర్మూర్‌కు చెందిన వారు మరొకరు ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు చేసిన బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసానికి గురయ్యామని క్రాంతి అనే వ్యక్తి బుధవారం ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సతీష్ అనే వ్యక్తికి ఐదుగురం డబ్బులు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుల ఆందోళన.. రోగుల నరకయాతన
వైద్యుడిపై కేసు తొలగించే వరకు నిరసన ఆగదు: వైద్యులు నిజామాబాద్ అర్బన్: పై చిత్రంలో రోది స్తున్న మహిళ పేరు లక్ష్మి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఈమె మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి గుండెజబ్బు సమస్యతో వచ్చింది. ఉదయం 9 గంటలకు ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకొని వెళ్లగా.. అక్కడ వైద్యులెవరూ లేరు. వారు విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నారు. వైద్యుల కోసం వేచి చూసిన లక్ష్మి నొప్పితో విలవిల్లాడుతూ ‘సారూ.. మమ్మల్ని చూడండి.. మీకు దండం పెడతా.. అని వైద్యులకు విలపిస్తూ విన్నవించింది. అయినా వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఉదయం 12 గంటల వరకు ఓపీ విభాగంలో 200 మంది పైగా రోగులు ఉన్నా వైద్యులు రాలేదు. గంటలతరబడి రోగులు వేచి చూసి వెళ్లిపోయారు. అత్యవసర చికిత్స కు వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు. ఏం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ సోమవారం పాము కాటుకు గురయ్యా డు. బంధువులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటికే మల్లేశ్ మృతి చెందాడు. అత్యవసర విభాగంలో ఉన్న వైద్యుడు నిర్లక్ష్యం వహించాడని స్ట్రైచర్ ఇవ్వలేదని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. తక్షణమే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లగా.. ఆమె ఆదేశానుసారం ఆస్పత్రికి డీఆర్వో, ఆర్డీవో, డీఎస్పీ వచ్చి విచారణ జరిపి డాక్టర్ అరవింద్‌పై కేసు నమోదు చేశారు. అకారణంగా కేసు నమోదు చేశారని మంగళవారం ఆస్పత్రి వైద్యులు విధులు బహిష్కరించారు. మూడున్నర గంటల పాటు రోగులు వైద్యుల కోసం ప్రాధేయపడిన వైద్యులు పట్టించుకోలేదు.