వైద్యుల ఆందోళన.. రోగుల నరకయాతన
వైద్యుడిపై కేసు తొలగించే వరకు నిరసన ఆగదు: వైద్యులు
నిజామాబాద్ అర్బన్: పై చిత్రంలో రోది స్తున్న మహిళ పేరు లక్ష్మి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఈమె మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి గుండెజబ్బు సమస్యతో వచ్చింది. ఉదయం 9 గంటలకు ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకొని వెళ్లగా.. అక్కడ వైద్యులెవరూ లేరు. వారు విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నారు. వైద్యుల కోసం వేచి చూసిన లక్ష్మి నొప్పితో విలవిల్లాడుతూ ‘సారూ.. మమ్మల్ని చూడండి.. మీకు దండం పెడతా.. అని వైద్యులకు విలపిస్తూ విన్నవించింది. అయినా వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఉదయం 12 గంటల వరకు ఓపీ విభాగంలో 200 మంది పైగా రోగులు ఉన్నా వైద్యులు రాలేదు. గంటలతరబడి రోగులు వేచి చూసి వెళ్లిపోయారు. అత్యవసర చికిత్స కు వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు.
ఏం జరిగిందంటే..
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ సోమవారం పాము కాటుకు గురయ్యా డు. బంధువులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటికే మల్లేశ్ మృతి చెందాడు. అత్యవసర విభాగంలో ఉన్న వైద్యుడు నిర్లక్ష్యం వహించాడని స్ట్రైచర్ ఇవ్వలేదని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. తక్షణమే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లగా.. ఆమె ఆదేశానుసారం ఆస్పత్రికి డీఆర్‌వో, ఆర్‌డీవో, డీఎస్పీ వచ్చి విచారణ జరిపి డాక్టర్ అరవింద్‌పై కేసు నమోదు చేశారు. అకారణంగా కేసు నమోదు చేశారని మంగళవారం ఆస్పత్రి వైద్యులు విధులు బహిష్కరించారు. మూడున్నర గంటల పాటు రోగులు వైద్యుల కోసం ప్రాధేయపడిన వైద్యులు పట్టించుకోలేదు.